ఏపీ సచివాలయంలో వాస్తు మార్పులు
Published on: Fri May 31, 2019 3:52PM

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. గతంలోనే ఏపీ సచివాలయం వాస్తు దోషాల మయం అని ప్రచారం జరిగింది. అప్పట్లో చంద్రబాబు హయాంలోనూ అనేక మార్పులు చేయించినట్టు తెలుస్తోంది. తాజాగా ఏపీ సీఎంగా జగన్ వచ్చాక కూడా పలు వాస్తు లోపాలను గుర్తించారు. ఈ మేరకు సచివాలయంలో యుద్ధప్రాతిపదికన వాస్తు మార్పులు చేయిస్తున్నట్టు సమాచారం.
ముఖ్యంగా, సచివాలయం మొదటి బ్లాక్ లో వాస్తు మార్పులు చేయాలని వైసీపీ అగ్రనేతలు సూచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం చాంబర్ లోకి వెళ్లే ఒక ద్వారాన్ని మూసివేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఛాంబర్‌ను కూడా మారుస్తున్నారు. ఆగ్నేయం మూలగా ఉన్న సీఎస్ ఛాంబర్ పక్కనే కొత్త ఛాంబర్ నిర్మిస్తున్నారు. దాని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జగన్ సచివాలయంలో అడుగుపెట్టకముందే.. సచివాలయంలో వాస్తుమార్పులు చేస్తున్నారు. ఇప్పటికే సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జగన్.. వచ్చేవారం సచివాలయానికి వచ్చే అవకాశం ఉంది.


