సచివాలయంలో షట్‌డౌన్.. జగన్‌ను కలిసిన డీజీపీ.. ఏం జరుగుతోంది?
Published on: Fri Feb 4, 2022 2:02PM
చలో విజయవాడ సంచలనంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో జగన్ సర్కారు ఉలిక్కిపడింది. పోలీసుల కట్టడిని చేధించుకుని మరి.. చలిచీమల వలే దండెత్తి వచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు. బెజవాడను ఎరుపెక్కించారు. పీఆర్సీ జీవోల రద్దు కోసం గొంతెత్తి నినదించారు. ఆ సౌండ్.. తాడేపల్లి ప్యాలెస్‌లో రీసౌండ్‌గా మారింది. జగనన్నకు రాత్రంతా నిద్రే పట్టలేదంటున్నారు. ఆఫ్ట్రాల్ ఉద్యోగులే కదాని లైట్ తీసుకుంటే.. ఇంతగా దడదడలాడిస్తుండటం జగన్‌రెడ్డి ఊహించలేకపోయారు. ఇప్పటికే చేతులు కాలిపోగా.. ఇప్పుడిక ఆకులు పట్టుకున్నా, ఉద్యోగుల చేతులు పట్టుకున్నా.. పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని అంటున్నారు.
చలో విజయవాడ సక్సెస్‌తో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్సాహం మరింత రెట్టించింది. అదే ఊపుతో.. పీఆర్సీ పెంపుపై ఊ అంటావా జగనన్న? ఊఊ అంటావా జగనన్నా? అంటూ సమ్మెతో సవాల్ చేస్తున్నారు. 6వ తేదీ ఆదివారం అర్థరాత్రి నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు. అయితే, సచివాలయ ఉద్యోగులకు శనివారం సెలవు కావడంతో.. శుక్రవారం నుంచే పెన్‌డౌన్ కార్యక్రమం చేపట్టారు. సచివాలయంలో కంప్యూటర్లు షట్‌డౌన్ చేసి నిరసన తెలిపారు. ఉద్యోగుల నిరసనతో అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
మరోవైపు, చలో విజయవాడ వెనుక కొన్ని రాజకీయ పార్టీల ప్రోద్బంలం ఉందంటూ వైసీపీ మూకలు సోషల్ మీడియాలో దుస్ప్రచారం చేపట్టడంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, ఇతర రాజకీయ పార్టీల వ్యక్తులు ఎవరూ పాల్గొనలేదని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేయొద్దని కోరారు. కొందరు వ్యక్తులు ఉద్యోగుల పట్ల ప్రజలల్లో వ్యతిరేక భావన తెచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఉద్యోగులు స్వచ్ఛందంగా తరలిరావడంతో ‘చలో విజయవాడ’ విజయవంతమైందన్నారు. విజయవాడ చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి ఉద్యమం చూడలేదని వెంకట్రామిరెడ్డి చెప్పారు.
ఇక, చలో విజయవాడ దెబ్బకు దిమ్మతిరిగి పోయిన జగన్‌రెడ్డి.. హడావుడిగా డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను పిలిపించుకుని మాట్లాడారు. పోలీసుల వైఫల్యం వల్లే వేల మంది ఉద్యోగులు విజయవాడకు రాగలిగారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చలో విజయవాడ సక్సెస్‌తో ప్రభుత్వ పరువంతా పోయిందని.. ఉద్యోగులు గెలిచారని.. ఇదంతా ఖాకీల ఫెయిల్యూరే వల్లేనంటూ జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. సుమారు అరగంట పాటు సీఎం-డీజీపీల సమావేశం జరిగింది. చలో విజయవాడ ఎపిసోడ్‌పై పూర్తి నివేదిక కోరినట్టు.. భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై డీజీపీకి సీఎం జగన్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.


