ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించొద్దు! గుంటూరు, చిత్తూరు కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశం
Published on: Fri Feb 5, 2021 10:47AM
పంచాయతీ ఎన్నికల అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించవద్దంటూ కలెక్టర్లకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవరకు ఫలితాలను హోల్డ్‌లో ఉంచాలని పేర్కొంది. తమకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి నివేదిక పంపాలని చిత్తూరు, గుంటూరు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించింది.
ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహగరణ గడువు గురువారంతో ముగిసింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగినట్లు ఎన్నికల కమిషన్ గుర్తించింది. మిగితా జిల్లాలకు విభిన్నంగా ఉండటంతో కమిషన్ ఈ వ్యవహారంపై ఆరా తీసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎన్నికలకు సంసిద్ధత పట్ల ఎన్నికల సంతృప్తిని వ్యక్తం చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి చర్యలు తీసుకుంటున్నారని అభినందించింది. పోలీసులు వ్యాక్సినేషన్ వేయించుకునే కార్యక్రమాన్ని పక్కనపెట్టి ఎన్నికల విధులు నిర్వహించడానికి ముందుకు రావడంపై ఎస్‌ఈసీ అభినందనలు తెలిపింది.


