రేషన్ డెలివరీ వాహనాలను పరిశీలించిన నిమ్మగడ్డ!
Published on: Wed Feb 3, 2021 11:35AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం ఉదయం రేషన్ పంపిణీ వాహనాలను పరిశీలించారు. ఏపీ ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ రూపొందించిన నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించిన రెండు వాహనలను ఎస్‌ఈసీ పరిశీలించారు. ఈ సందర్భంగా పంపిణీ ఏ రకంగా జరుగుతుందో పౌరసరఫరాలశాఖ కమీషనర్ కోన శశిధర్ వివరించారు. పంపిణీ వాహనంలో ఎక్కి పరిశీలించిన నిమ్మగడ్డ... వాహనాలలో ఉన్న సదుపాయాలు, వినియోగాన్ని పరిశీలించారు. వాహనం డ్రైవర్ కేబిన్‌లో కూర్చుని రేషన్ పంపిణీ వివారాలను అధికారులను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అడిగి తెలుసుకున్నారు.
స్థానిక సంస్థల నేపథ్యంలో రేషన్ డెలివరీ వాహనాలపై రాజకీయ నేతల ఫొటోలు, పార్టీ గుర్తులు ఉండొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నెల ఒకటో తేదీ నుంచే ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిబంధనలకు లోబడే రేషన్ వాహనాల ద్వారా సరకుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని హైకోర్టు తెలపడంతో ఆ దిశగా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో నిబంధనల అమలు సక్రమంగా జరుగుతోందా? అన్న విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దృష్టి పెట్టారు. అందులో భాగంగానే రేషన్ డెలివరీ వాహనాలను ఆయన తనిఖీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆఫీసుకు, రేషన్ డెలివరీ వాహనాలను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకొచ్చారు. దీంతో స్వయంగా వాటిని తనిఖీ చేశారు నిమ్మగడ్డ. ఆయా వాహనాలపై ఉన్న రంగులతో పాటు ఫొటోలను పరిశీలించారు.


