విడాకులు తప్పవా..?

 

ఇష్టం లేని మొగుడితో ఎన్నాళ్లు కాపురం చేస్తాం చెప్పండి.. అందుకే విడాకులు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దలు ఏదో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ బంధం నిలబడేది కాదని వారికి తెలుసు. ఇదేదో మొగుడు పెళ్లాల విడాకుల మ్యాటర్ కాదు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే మీకే.. మేం ఏం చెబుతున్నామో అర్థమవుతుంది. ఆంధ్రాలో టీడీపీని వదుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుండటం.. ఇంతకాలం ఎన్నాన్నా.. ఏం చేసినా భరిస్తూ వచ్చిన తెలుగుదేశం అధినేత కూడా ఇక సంసారం కష్టమే అనేలా వ్యాఖ్యలు చేయడంతో.. టీడీపీ-బీజేపీ కోటకి బీటలు వారినట్లేనని ఓ నిర్ణయానికి వచ్చేశారు విశ్లేషకులు.

 

చంద్రబాబును ఆయన పాలనను విమర్శిస్తూ వస్తోన్న కొందరు ఏపీ బీజేపీ నేతలు.. పోలవరం స్పిల్‌వే టెండర్ల విషయంలో కేంద్రం అడ్డు చెప్పిన తర్వాత తమ స్వరాన్ని మరింత పెంచుతూ పోయారు. కేంద్రం ఇప్పటికే చాలా చేసిందని.. ఇంకేం కావాలంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఈ సమయంలో ఇరు పార్టీ నేతల మధ్య రగిలిన వేడి టీడీపీ-బీజేపీ స్నేహన్ని బూడిద చేస్తుందని విశ్లేషకులు భావించారు. అయితే ప్రధాని మోడీని చంద్రబాబు కలిస్తే పరిస్థితి చక్కబడుతుందని భావించారు.. కానీ విచిత్రంగా వీరిద్దరి సమావేశం తర్వాత రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరుగుతూ వచ్చింది.. విమర్శలు ఎక్కువయ్యాయి. స్వయంగా ముఖ్యమంత్రి కూడా పలు సందర్భాల్లో పొత్తు గురించి మాట్లాడారు. అవసరమైతే తెగదెంపులకు సిద్ధంగా ఉన్నామన్నారు.

 

పెటాకులకి బాబు కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు రావడంతో విడిపోవడానికి ఇదే సరైన సమయమని ఏపీ బీజేపీ నేతలు హైకమండ్‌తో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టీడీపీని వదులుకోవడంపై బీజేపీ అధినాయకత్వంలోని పలువురు భిన్న వాదనలు వినిపిస్తున్నారట.

 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కమలంతో మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం మాత్రమే. రెండున్నర దశాబ్ధాలకు పైగా బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ వస్తోన్న శివసేన.. మోడీ-అమిత్‌షాల వైఖరి నచ్చక ఎన్డీఏలో నుంచి తప్పుకుంది. శివసేన వంటి పార్టీయే అలాంటి నిర్ణయం తీసుకోవడంతో.. బీజేపీతో ఏ రాష్ట్రంలోనూ పొత్తులు పెట్టుకోవడానికి ఆయా ప్రాంతీయ పార్టీలు ముందుకు రాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీని కూడా బలవంతంగా వదిలించుకోవడం.. తప్పుడు సంకేతాలను పంపిస్తుందని కొందరు బీజేపీ పెద్దలు అంటున్నారట. కానీ మోడీ- అమిత్‌షాల వద్ద ఈ విషయాన్ని చర్చించే ధైర్యం చాలక మిన్నకుంటున్నారట. అయినా బాబు ఛరిష్మా గురించి తెలిసిన చాలా మంది స్నేహాన్ని నిలిపేందుకు తెరవెనుక రాయబారాలను నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ ముసుగులో గుద్దులాటకు ముగింపు ఎప్పుడో కాలమే నిర్ణయించాలి.