బాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన పోలీసులు.. ఎందుకింత భయం?

 

'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదన్న చంద్రబాబు.. అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయనను అడ్డుకునేందకు ఉండవల్లిలోని ఆయన ఇంటి బయట పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు కారుని బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా గేట్లు వేసి.. గేటు తెరిచేందుకు వీలు లేకుండా బయట నుంచి లావైన తాళ్లతో కట్టారు. గేటు బయట భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు లోపల కారులో కూర్చొని బయటకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు.. పోలీసులకు, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తనను ఇంట్లో పెట్టి ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఆపలేరని అన్నారు. మరికాసేపట్లో ఛలో ఆత్మకూరుకు బయల్దేరుతామని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదన్నారు. ఎన్నిరోజులు తనను హౌస్ అరెస్ట్ చేస్తారు? అంటూ ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ అణిచివేత వైఖరిని ప్రజా సంఘాలు, మేధావులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీని అణిచేయాలని చూస్తున్నారన్నారు. ఆత్మకూరు బాధితులను తానే గ్రామానికి తీసుకెళ్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

చంద్రబాబుతో సహా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ సర్కార్ భయంతోనే అరెస్ట్ లు చేసి 'ఛలో ఆత్మకూరు' ను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ దౌర్జన్యాలు బయటపడతాయని భయంతోనే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.