సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చర్యలు.. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మౌనం!

ఏడాది కాలంగా ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ నెల రోజుల వ్యవధిలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. అంతర్వేది నరసింహ స్వామి రథం దగ్దం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండే సింహాలు మాయం, విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం, తాజాగా కర్నూల్ జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం.. ఇలా రాష్ట్రంలో వరుసగా ఘటనలు చేసుకుంటున్నాయి. అయితే, రాష్ట్రంలో ఈ స్థాయిలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

ఇటీవల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారంటూ ఎందరికో నోటీసులు ఇచ్చారు, కేసులు పెట్టారు. 60 ఏళ్ళు దాటిన పెద్దావిడను సైతం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ షేర్ చేశారంటూ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టారు. కేవలం సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ లు పెట్టినందుకే.. కేసులు, విచారణలు అంటూ హడావుడి చేసిన పోలీసులు.. ఇప్పుడు హిందూ ఆలయాలపై ఈ స్థాయిలో దాడులు జరుగుతుంటే ఎందుకు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రథం దగ్దం ఘటన తేనె తీసే క్రమంలో జరిగిందని, పిచ్చి వాళ్ళ పని అయ్యుంటుందని చెప్పుకొచ్చారు. విజయవాడ దుర్గ గుడిలో వెండి సింహాలు ఎలా మాయమయ్యాయో కనీస అంచనాకు రాలేకపోయారు. ఇక మిగతా దేవుళ్ళ విగ్రహాల ధ్వంసం ఘటనలు సరేసరి. ఇంతవరకు దాడులకు కారణమైన వారిని పట్టుకోలేకపోయారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని పట్టుకోవడం మీద పెడుతున్న శ్రద్ధ.. హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని పట్టుకోవడంలో ఎందుకు పెట్టలేకపోతున్నారు?. దేవుడు కూడా అధికార పార్టీకి చెందిన వాడైతే చర్యలు తీసుకుంటారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.