జ‌గ‌న్ భ‌ద్ర‌త‌లో నిర్ల‌క్ష్యం.. సీఎం కాన్వాయ్ లో కలిసిపోయిన ఇతర వాహనాలు!!

 

ఏపీ సీఎం వైఎస్ భద్రత విషయంలో పోలీసులు వ్యవహరిస్తోన్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీఎం కాన్వాయ్‌లోకి సాధార‌ణ వాహ‌నాలు వచ్చి కలిసిపోయాయి. సీఎం కాన్వాయ్ వ‌స్తున్న స‌మ‌యంలో భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా ఇత‌ర వాహ‌నాల‌ను అనుమ‌తించ‌రు. కానీ, జ‌గ‌న్ రాజ‌న్న బ‌డిబాట కార్య‌క్ర‌మం కోసం వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

సీఎం జ‌గ‌న్ శుక్ర‌వారం త‌న నివాసం నుండి పెనుమాక‌లో ఏర్పాటు చేసిన రాజ‌న్న బ‌డిబాట కార్య‌క్ర‌మంలో పాల్గొంనేందుకు బ‌య‌ల్దేరారు. ఆ స‌మ‌యంలో సీఎం కాన్వాయ్ ఉండ‌వ‌ల్లి సెంట‌ర్ మీదుగా తాడేప‌ల్లి వైపుకు వ‌స్తుండ‌గా.. ఉండ‌వ‌ల్లి నుండి ప్ర‌కాశం బ్యారేజి వైపు వెళ్లే వాహ‌నాల‌ను ఒక్క సారిగా వ‌దిలేసారు. దీంతో సీఎం కాన్వాయ్‌లో ఇత‌ర వాహ‌నాలు క‌లిసి పోయాయి. ఇలా, సీఎం ప్రయాణించే మార్గంలో ఇతర వాహనాలను అనుమతించడం ఆయన భద్రతకు ముప్పని పోలీస్‌ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పోలీసు ఉన్న‌తాధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

అయితే తన కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిలిపివేయవద్దని జగనే చెప్పినట్లు సమాచారం. సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత జ‌గ‌న్ అధికారుల‌కు కొన్ని సూచ‌న‌లు చేసారు. జ‌గ‌న్ త‌న నివాసం నుండి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి వెళ్లే స‌మ‌యంలో మార్గ మ‌ధ్య‌లో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేసారు. అయితే త‌న కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిలిపివేసి సామాన్య ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని.. గ‌న్న‌వ‌రం వెళ్లేందుకు త‌న‌కు ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూడాల‌ని సీఎం ఆదేశించారు. దీంతో.. ఉండ‌వ‌ల్లి లోని సీఎం నివాసం నుండి గ‌న్న‌వ‌రం వ‌ర‌కు ప్ర‌త్యామ్నాయ మార్గం చూసే వ‌ర‌కూ హెలికాఫ్ట‌ర ద్వారా గ‌న్న‌వ‌రం చేరుకొనేలా చూడాల‌ని అధికారులు భావించారు. అయితే, ముఖ్య‌మంత్రి నివాసం వ‌ద్ద హెలిపాడ్‌కు అనువుగా లేక‌పోవ‌టంతో.. ఆ ప్ర‌తిపాద‌న విర‌మించుకున్నారు. ఇక‌, తాగా ఘ‌ట‌న‌తో పోలీసు ఉన్న‌తాధికారులు సైతం అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.