ఏపీ ప్రజలకు కష్టాల్లో ఉన్నప్పుడే బాబు గుర్తుకొస్తాడా?
Published on: Fri Jun 14, 2019 4:06PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితం కావడంపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ లో ఈరోజు జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో గల్లా జయదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు సంక్షోభ సమయంలోనే చంద్రబాబు గుర్తుకు వస్తారని.. అన్నీ సాఫీగా ఉన్న సమయంలో ప్రజలు వేరే పార్టీలవైపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ఇంకా చంద్రబాబు అవసరం ఉందని గల్లా అభిప్రాయపడ్డారు. ఆ విషయం ఏపీ ప్రజలకు త్వరలోనే తెలుస్తుందని చెప్పారు.
అదేవిధంగా కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న కేశినేని నాని గురించి కూడా గల్లా స్పందించారు. లోక్ సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినవారిలో కేశినేని నాని ప్రథముడని గల్లా జయదేవ్ అన్నారు. పార్టీలోఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నాని హర్ట్ అయినట్లు తనకు అనిపిస్తోందని చెప్పారు. కేశినేని నాని టీడీపీని వీడరనీ, పార్టీలోనే కొనసాగుతారని గల్లా స్పష్టం చేశారు.


