ఏపీ యన్జీవోల సభకు అనుమతెందుకు

 

ఏపీ యన్జీవోలు ఈ నెల 7న హైదరాబాదులో తలపెట్టిన భారీ బహిరంగ సభకు పోలీసులు అనుమతినీయడం, అదే సమయంలో టీ-జేఏసీ, ఓయు విద్యార్ధి జేఎసీలు తలపెట్టిన ర్యాలీలకు అనుమతి నిరాకరించడం వివాదస్పదమైంది. ఊహించినట్లుగానే టీ-కాంగ్రెస్, తెరాస తదితర తెలంగాణావాదులు పోలీసులను, వారి నిర్ణయం వెనుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పుపడుతున్నారు. మీడియాలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి అభీష్టం మేరకే ఏపీ యన్జీవోల సభకు పోలీసులు అనుమతినిచ్చారని వార్తలు ప్రచురితమయ్యాయి.

 

అయితే, ఈ నిర్ణయం వివాదాస్పదం అవుతుందని ముఖ్యమంత్రికి తెలియకనే ఆయన ఏపీ యన్జీవోల సభకు అనుమతినిచ్చారనుకోలేము. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా సమైక్యవాదిగా వాదిస్తున్నఆయన తన భవిష్యత్ సీమంధ్రతోనే ముడిపడి ఉంటుందనే సంగతి గ్రహించినందునే, బహుశః ఏపీ యన్జీవోల సభకు అనుమతించివచ్చును. తద్వారా మున్ముందు సీమంధ్రలోవారి మద్దతు పొందే అవకాశం ఉంటుంది.

 

ఈ నిర్ణయం వలన ఆయన ప్రస్తుతం తెలంగాణా నేతల నుండి విమర్శలు ఎదుర్కొన్నపటికీ దానివల్ల ఆయనకి నష్టం జరుగకపోగా మేలే జరుగుతుంది. ఆయనపై తెలంగాణావాదులు దాడిచేస్తున్న కొద్దీ సీమంధ్రలో ఆయన పట్ల ప్రజలకి మరింత సానుభూతి, మంచి అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే తన సమైఖ్యవాదంతో సీమంద్రాలో ‘డేరింగ్ యండ్ డాషింగ్ రియల్ హీరో’గా మంచి పేరు తెచ్చుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి, ఈ సభకు అనుమతినీయడం ద్వారా ఏపీ యన్జీవోల మద్దతు పొందటం, తెలంగాణా వాదులను అడ్డుకొన్నకారణంగా మరింత గుర్తింపు పొందడం ఖాయం.