రాజకీయ మద్దతులేని ఏపీయన్జీవోలు చులకనయ్యారా

 

తెలంగాణా ఉద్యమంలో కీలకపాత్ర వహించిన టీ-ఎన్జీవోలు తెరాస నుండి రాజకీయ మద్దతు కూడా తీసుకోవడంతో వారు ఒక బలీయమయిన శక్తిగా నిలిచారు. అందువల్ల ప్రభుత్వము కానీ, కాంగ్రెస్, తెదేపా, వైకాపాలు గానీ వారి వంక కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోయాయనేది బహిరంగ రహస్యమే. కానీ, ఏపీఎన్జీవోల విషయంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా జరుగుతోంది.

 

వారు ఏ రాజకీయ పార్టీ మద్దతు స్వీకరించేందుకు ఇష్టపడలేదు. కారణం సీమాంధ్రలో తెరాస వంటి ఉద్యమ పార్టీ లేకపోవడమే. ఒకవేళ వారు ఏ రాజకీయ పార్టీ మద్దతు స్వీకరించినా మిగిలిన పార్టీలు వారిని తమ బద్ధ శత్రువులుగా పరిగణిస్తాయి. కానీ వారి ఏపార్టీ మద్దతు తీసుకోకపోయినా అందరికీ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. కారణం, వారు అన్నిపార్టీలకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులను రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని గట్టిగా కోరడమే.

 

పదవులను వదులుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడని సీమాంధ్ర నేతలకు ఇప్పుడు ఏపీయన్జీవోలు శత్రువులుగా మారిపోయారు. అందువల్ల వారిపట్ల చులకన భావం కూడా వారి మాటలలో వ్యక్తమవుతోంది. మంత్రి పార్ధ సారధి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రౌడీ మూకలు జొరబడుతున్నాయని, దాని వల్ల ఉద్యమానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఇక వైకాపా నేత దాడి వీరభద్రరావు ఏపీఎన్జీవో నాయకుడు అశోక్ బాబు రాజీనామాల విషయంలో రోజుకొక ప్రకటన చేస్తున్నారని విమర్శించారు.

 

అదేవిధంగా సమైక్యవాదుల చేతిలో పరాభవం ఎదుర్కొన్న కావూరి, చిరంజీవి, సుబ్బిరామి రెడ్డి, క్రుపారాణీ తదితరులు కూడా వారిపట్ల ఆగ్రహంతో ఉన్నారు. పదేపదే తమను రాజినామాల కొరకు ఒత్తిడి చేయడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే క్రమంగా రాజకీయ పార్టీ నేతలు ఒకరొకరుగా ఏపీఎన్జీవోలపై విమర్శలు మొదలుపెట్టారు. బహుశః వారికి ఎటువంటి రాజకీయ అండదండలు లేకపోవడం వలనే వారిని విమర్శించడానికి దైర్యం చేయగలుగుతున్నారను కోవచ్చును.

 

ఏపీఎన్జీవోల నాయకుడు అశోక్ బాబు, ఈ విమర్శలకు బదులు ఇస్తూ తాము వ్యక్తిగతంగా ఎవరినీ వ్యతిరేఖించడం లేదని, కేవలం ప్రజాప్రతినిధుల రాజకీయ నిర్ణయాలను, ఆలోచనలను మాత్రమే తప్పుపడుతున్నామని అన్నారు. ప్రజలందరూ సమైక్యాంద్ర కోసం ఉద్యమాలు చేస్తుంటే, ప్రజాప్రతినిధులు పదవులు పట్టుకొని వ్రేలాడటంలో ఔచిత్యం ఏమిటో వారే చెప్పాలని ఆయన ఘాటుగా బదులిచ్చారు. ఇక తాము ఎవరి యాత్రలకు, సమావేశాలకు అడ్డుపడమని ఎవరికీ పిలుపునీయలేదని , ఒకవేళ ఉద్యోగులు నిజంగా క్రమశిక్షణను పక్కన బెడితే రాజకీయ నాయకులు ప్రజలలో తిరగడం కూడా కష్టమవుతుందని తెలుసుకోవాలని ఆయన అన్నారు.

 

రాజకీయ పార్టీలన్నిటినీ తాము సమదూరంలో పెడుతున్నామని, అంత మాత్రాన్న తమ శక్తిని తక్కువగా అంచనా వేసి భంగపడవద్దని ఆయన ఉద్యోగులను విమర్శిస్తున్న రాజకీయనేతలను గట్టిగా హెచ్చరించారు.