ఏప్రిల్ 4, ఉదయం 9:05.. కొత్త జిల్లాల ముహూర్తం ఇదే..
Published on: Wed Mar 30, 2022 2:52PM
ఉగాదికే కొత్త జిల్లాలు అన్నారు. కరెక్టుగా ఉగాది నాడే కాకున్నా.. రెండు రోజులు ఆలస్యంగానైనా ఏపీలో కొత్త జిల్లాలు అవతరించబోతున్నాయి. ఆ మేరకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4న.. ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
కొన్ని వారాలుగా కొత్త జిల్లాల కుంపటి వైసీపీని, ప్రభుత్వాన్ని వేధిస్తోంది. జిల్లాల ఏర్పాటు సరిగ్గా లేదంటూ.. అనేక జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి. వైసీపీలో వర్గ పోరుకూ అవి కారణమయ్యాయి. సీనియర్ ఎమ్మెల్యే ఆనం లాంటి వాళ్లు కొత్త జిల్లాల ఏర్పాటు తీరు బాలేదంటూ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇక గోదావరి జిల్లాలో కొత్తపల్లి సుబ్బారాయుడు అయితే ఏకంగా తనను తాను చెప్పుతో కొట్టుకోవడం.. జిల్లాల ఏర్పాటు ఎంత చెత్తగా ఉందనే దానికి నిదర్శనం. పేరు మార్పు, సరిహద్దులు మార్పు, జిల్లా హెడ్‌క్వార్టర్ మార్పు, డివిజన్ మార్పు.. ఇలా అనేక మార్పుల కోసం వేలల్లో ఫిర్యాదులు వచ్చాయి. కొత్త జిల్లాల వ్యవహారం జగన్ సర్కారుకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చాయి.
దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ అధ్యక్షతన తాజాగా ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలు, సలహాలపై అధికారులతో జగన్ చర్చించారు. పలు జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లు మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా చర్చ జరిగింది.
26 జిల్లాల ఏర్పాటునకు గానూ వర్చువల్‌గా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్ విజయవాడ జిల్లాలు ఉనికిలోకి రానున్నాయి.
పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ ఏప్రిల్ 4న.. ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య అమల్లోకి రానున్నాయి.


