TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒకే వీధి.. రెండు జిల్లాలు.. జగనన్న మాయాజాలం!

Published on: Tue Apr 5, 2022 12:52PM

ఏపీలో కొత్త జిల్లాలు కొలువుదీరాయి. 26 జిల్లాల‌తో న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డింది. అయితే, ఏ ఒక్క జిల్లా వాసులు కూడా పూర్తిగా సంతోషంగా, సంతృప్తిగా మాత్రం లేరు. అంతా అడ్డ‌గోలు విభ‌జ‌న అంటూ మండిపాట్లు. ప్ర‌జ‌లు కోరుకుంది వేరు.. ప్ర‌భుత్వం మార్చింది వేరు. పాత జిల్లాల కంటే కొత్త జిల్లాల్లోనే.. జిల్లా కేంద్రాలు దూర‌మైన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. అందుకే, కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్ప‌టికీ ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు జోరుగా జ‌రుగుతున్నాయి. తాజాగా, ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం వెలుగు చూసింది. జ‌గ‌న‌న్న జిల్లాల విభ‌జ‌న ఎలా సాగిందో చెప్ప‌డానికి అదో బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది. 

అన‌గ‌న‌గా ఒక ఊరు. ఆ గ్రామంలో ఓ సిమెంట్ రోడ్డు. ఆ రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు. ఇదంతా కామ‌నే అయినా.. ఈ రోడ్డుకు మాత్రం ఓ స్పెషాలిటీ ఉంది. ఆ ర‌హ‌దారికి ఒక‌వైపు ఓ జిల్లా.. మ‌రోవైపు ఇంకో జిల్లా. అంటే, ఆ రోడ్డు రెండు జిల్లాల‌ను విభ‌జిస్తున్న‌ట్టు. కేవ‌లం జిల్లాలే రెండు కాదు.. గ్రామాలు, మండ‌లాలు, నియోజ‌క‌వ‌ర్గాలు కూడా వేర్వేరు. అందుకే ఇప్పుడు ఆ వీధి గురించి ఏపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. 

ఆ వీధికి ఒక‌వైపు తాడిపూడి గ్రామం.. ఇంకోవైపు మహాలక్ష్మిదేవిపేట. రెండు ఊర్లు క‌లిసే ఉన్న‌ట్టు ఉంటాయి.. ఓ రోడ్డు మాత్రం వాటిని వేరు చేస్తుంటుంది. కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలంలోని తాడిపూడి... పోలవరం నియోజకవర్గంలోని గూటాల పంచాయతీ పరిధిలోని మహాలక్ష్మిదేవిపేట గ్రామాలు.. వేర్వేరు జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. ఒకే వీధిలో ఓ వైపున ఉన్న తాడిపూడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి మారగా.. మహాలక్ష్మిదేవిపేట ఏలూరు జిల్లాలో చేరింది. నియోజ‌క‌వ‌ర్గాన్ని బేస్ చేసుకొని జిల్లాల విభ‌జ‌న చేయ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింది. ఇలాంటి ప్ర‌త్యేక కేసుల్లో అధికారులు కాస్త చొర‌వ తీసుకొని ప‌ని చేసి ఉంటే.. ప్ర‌జ‌ల‌కు సౌల‌భ్యంగా ఉండేది.