బలిపీఠంగా మారుతోన్న ప్రత్యేక హోదా నినాదం!

 

 

తెలుగు నేల ఏ క్షణాన రాష్ట్రాలుగా ఏర్పడిందోగానీ… ఇక్కడ ఎప్పుడూ బలిదానాలే! నిజాం నిరంకుశ పాలనలో వేల మంది ప్రాణాలు కోల్పాయరు. ఆ తరువాత భారతదేశంలో విలీనం అయిన హైద్రాబాద్ సంస్థానం ఆంధ్రాతో కలిసింది. తెలంగాణతో కలవటానికి ముందే ఆంద్ర రాష్ట్రం పొట్టి శ్రీరాములు బలిదానంతో ఏర్పడింది. ఇక ఆంధ్రా, తెలంగాణలు ఎలాగో కలిసి సమైక్యాంద్ర ఏర్పడితే… అది అనేక కారణాల వల్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కారణమైంది. 1969లో తెలంగాణ ఉద్యమకారులు చనిపోయారు. వెంటనే… కొన్నేళ్లకే ప్రత్యేకాంధ్ర ఉద్యమంతో మరి కొంత మంది అసువులు బాయాల్సి వచ్చింది. ఇక 2014 విభజనతో ముగిసిన ఉదమ్యం సంగతైతే చెప్పక్కర్లేదు! తెలంగాణలో అనేక ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆంద్రలోనూ కొందరు బలవన్మరణం పాలయ్యారని వార్తలొచ్చాయి. మొత్తానికి ఏపీ, తెలంగాణ వేరు వేరు అయిపోయాక ఈ బలిదానాల గుండెకోత వుండదని అంతా భావించారు! కానీ, ఇప్పుడు మరోమారు ప్రత్యేక హోదా బలిపీఠంపై తెలుగు ప్రాణాలు పణంగా పెట్టబడుతున్నాయి! ఇది నిజంగా విషాదం…

 

 

చంద్రబాబు నాయుడు స్వంత జిల్లా చిత్తూరులోని మదనపల్లెలో సుధాకర్ అనే 26 ఏళ్ల యువకుడు ఉరితాడుకు వేలాడి ప్రాణాలు తీసుకున్నాడు. కారణం…. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని! ఇంకా బోలెడంత జీవితం మిగిలి వున్న ఆ యువకుడు , చేసేది చేనేత పని! తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులు! వింటుంటేనే ఎవరికైనా దుఃఖం పొంగుకొస్తుంది. తెలంగాణ ఉద్యమ ఉధృతిలోనూ ఇదే స్థితిని చూసింది తెలుగు జాతి. దిల్లీ పాలకుల నిర్లక్ష్యానికి మనమెప్పుడూ మూల్యం చెల్లిస్తూనే వున్నాం. నెహ్రు నుంచీ మోదీ దాకా ఇదే పద్ధతి. నెహ్రూ సకాలంలో స్పందించకే పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం చేయాల్సి వచ్చింది. ఇప్పటికే అదే దుస్థితి కొనసాగుతోంది. అయితే, ప్రత్యేక హోదా విషయంలో మోదీ సర్కార్ చాలా స్పష్టంగా వీలుకాదని చెబుతోంది. ఆంధ్రా అధికార, ప్రతిపక్ష నాయకులు ఎవరికి తోచిన రీతిలో వారు పోరాడుతున్నారు. ఏ కొంత రాజకీయ పరిజ్ఞానం వున్న వారికైనా ప్రత్యేక హోదా రాదని స్పష్టంగానే అవగాహన వుంటుంది. కనీసం జేసే దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు మోదీ ప్రధానిగా వున్నంత కాలం హోదా డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సాద్యం కాదు. ఇదంతా సుధాకర్ లాంటి అమాయకులకి చేరవేయటంలో రాజకీయ పార్టీలు, మీడియా, సోషల్ మీడియా విఫలం అవుతున్నాయి.

 

 

బ్రిటీష్ వాళ్లతో స్వతంత్ర పోరాటం చేసినప్పుడు కూడా మనం కోరింది అంతా తేలిగ్గా లభించలేదు. కానీ, అప్పుడు ఇప్పటిలా ఆత్మహత్యలు జరగలేదు. కారణం ఉద్యమం నడిపే నేతలు జనానికి భరోసా కల్పించేవారు. ఏనాటికైనా బతికి సాధించగలమని నమ్మకం కలిగించే వారు. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్లు మాట్లాడుతూ, ఎవరి వ్యాఖ్యానాలు, విశ్లేషణలు వారు చేస్తూ రాష్ట్రం కోసం తపించే నిజాయితీపరుల్ని ఒత్తిడికి గురిచేస్తున్నారు. మదనపల్లెలో ఆత్మహత్య చేసుకున్న సుధాకర్ హోదా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడట. ఇలా చురుగ్గా పాల్గొంటూ తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారు కూడా అనేకం. ఇప్పుడు సుధాకర్ అలాగే చేశారు. ఈయనకంటే ముందే తిరుపతికి చెందిన మునుకోటి అనే వ్యక్తి హోదా కోసం ప్రాణాలు తీసుకున్నారు. ఇలాంటి వాట్ని రాజకీయ నేతలు సీరియస్ గానే తీసుకోవాలి. తమ పార్టీ కార్యకర్తల చేత చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రచారం చేయించాలి. మీడియాని, సోషల్ మీడియాని పెద్ద పెద్ద నాయకులు సమర్థంగా వాడుకుని ఆత్మహత్యలు వద్దని చెప్పాలి. లేదంటే, వందల మందిని బలితీసుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలాగే ప్రత్యేక హోదా కూడా అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జనాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ హోదా కోసమో, మరింక దేనికోసమో చేసుకునే ఆత్మహత్యల్ని హైలైట్ చేయకుండా వుండాలి. వాటి మీద చర్చ పెట్టి ముందు ముందు వేరే వారు చేసుకోకుండా చూడాలిగానీ…. టీఆర్పీల కోసం డెడ్ బాడీ వద్దకిపోయి సెన్సేషనలిజానికి తెగబడవద్దు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్… కేంద్రం జనం ఎందు కోసం ఆత్మహత్యల దాకా వెళుతున్నారో అర్థం చేసుకోవాలి!