మర్రికి మళ్లీ మొండిచేయి! ఏపీలో నలుగురు ఎమ్మెల్సీలు ఖరారు..
Published on: Fri Jun 11, 2021 9:28AM
ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రభుత్వం పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది, శుక్రవారం ఖాళీ కానున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్ దాదాపు ఖరారు చేశారని చెబుతున్నారు. అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు దస్త్రం పంపినట్లు తెలిసింది. శుక్ర లేదా శనివారం గవర్నర్ ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత మోషేను రాజు , గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి, కడప జిల్లాకు చెందిన ఆర్వీ రమేశ్‌యాదవ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు ఉన్నట్లు సమాచారం.
ఎమ్మెల్సీలుగా ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్న నలుగురిలో ముగ్గురి పేర్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. మోషన్ రాజు, లేళ్ల అప్పిరెడ్డిలకు ఎమ్మెల్సీ ఇస్తారని జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. గతంలో ఇస్తారని ఖచ్చితంగా భావించినా అవకాశం రాలేదు. దీంతో ఈ ఇద్దరికి ఈసారి సీఎం అవకాశం కల్పించారని తెలుస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులకు.. ఆయన పార్టీలో చేరినప్పుడే ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని చెబుతున్నారు. జగన్ హామీ మేరకే ఆయనను మండలికి పంపిస్తున్నారని తెలుస్తోంది. కడప జిల్లా నుంచి వినిపిస్తున్న ఆర్వీ రమేష యాదవ్ పేరు మాత్రం ఎవరూ ఊహించనది. మైదుకూరు నియోజకవర్గానికి చెందిన రమేష్ యాదవ్... మున్సిపల్ చైర్మన్ సీటు ఆశించినా.. సామాజిక వర్గ సమీకరణలో మరొకరికి వెళ్లింది. దీంతో పార్టీ కోసం మొదటి నుంచి పని చేస్తున్న రమేష్ కు ఎమ్మెల్సీ ఇస్తున్నారని అంటున్నారు.
ఎమ్మెల్సీ సీట్ల భర్తీతో మరోసారి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు మరోసారి నిరాశే ఎదురైంది. వైసీపీలో మొదటి నుంచి పని చేస్తున్నారు మర్రి రాజశేఖర్. గుంటూరు జిల్లాలో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అయితే జగన్ ఆదేశాలతో తన సీటును మరొకరికి వదలుకున్నారు మర్రి రాజశేఖర్. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానని చిలకలూరిపేట ఎన్నికల ప్రచార సమయంలో జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో అక్కడ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విడదల రజనీ గెలుపు కోసం మర్రి పని చేశారు. దీంతో మర్రి రాజశేఖర్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమని అంతా అనుకున్నారు.కాని ఇంతవరకు మర్రిని ఎమ్మెల్సీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ భర్తీ వచ్చిన ప్రతిసారి రాజశేఖర్ పేరు తెరపైకి రావడం.. ఆయనకు నిరాశ ఎదురుకావడం కామన్ గా మారింది. మర్రి రాజశేఖర్ కులమే ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుపడుతుందనే చర్చ జరుగుతోంది. కమ్మ కులానికి చెందడం వల్లే మర్రికి మళ్లీ మళ్లీ వైసీపీలో అవమానం జరుగుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.


