కాంగ్రెస్ తో పొత్తు.. మంత్రులు నై నై.. మరి బాబు?

 

ఇప్పుడు ఏపీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది కాంగ్రెస్, టీడీపీ పొత్తు గురించే.. ఈ పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమని కొందరు అంటుంటే, ప్రతిపక్షాలు మాత్రం అసలీ పొత్తు దారుణం, చరిత్రహీనం అంటూ భారీ డైలాగులు కొడుతున్నాయి.. అయితే ఈ పొత్తు గురించి చంద్రబాబు ఇంకా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం చెప్పలేదు కానీ మంత్రులు అసలు కాంగ్రెస్ తో పొత్తు అంటేనే మండిపడుతున్నారు.. రీసెంట్ గా కాంగ్రెస్ తో పొత్తు విషయంపై స్పందించిన పలువురు మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.. ఒక్కమాటలో చెప్పాలంటే మైక్ విరగ్గొట్టినంత పని చేసారు.

 

 

మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. దేశాన్ని దోచుకొని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ తో, టీడీపీ చేతులు కలిపితే ప్రజలు బట్టలూడదీసి తంతారని సంచలన వ్యాఖ్యలు చేసారు.. ఎన్టీఆర్ కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశాన్ని స్థాపించారు.. అలాంటిది ఇప్పుడు రాజకీయస్వార్థం కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదు.. దీన్ని ప్రజలు క్షమించరు.. మా అధినేత చంద్రబాబు అటువంటి తప్పు చేస్తారని నేను భావించటం లేదు.. రాజకీయంగా ఎంతో కీలకమైన ఇటువంటి అంశాన్ని పొలిట్ బ్యూరోలో చర్చించకుండా ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అయ్యన్న పాత్రుడు తేల్చిచెప్పారు.

 

 

ఇక ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కాంగ్రెస్ దరిద్రం టీడీపీకి అవసరంలేదని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.. కాంగ్రెస్, మోదీ, జగన్ మాకు బద్ధశత్రువులు.. కాంగ్రెస్ తో పొత్తు ప్రసక్తే లేదని కేఈ స్పష్టం చేసారు.. అదే విధంగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని అన్నారు.. మరోవైపు పురపాలక మంత్రి నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పొత్తుపై టీడీపీలో ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు.. మరి మంత్రులంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ తో పొత్తు అంటే మండిపడుతున్నారు.. అసలు కాంగ్రెస్ తో పొత్తు ప్రసక్తే లేదంటున్నారు.. చంద్రబాబుకి పార్టీ అవసరాలకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అలాంటిది ఆయన ఇంకా ఈ పొత్తు విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే, ఇలా మంత్రులు పొత్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో, అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.. ఒకవేళ చంద్రబాబు పొత్తుకి సై అంటే మంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని భయపడుతున్నారు.. మరి కాంగ్రెస్ తో పొత్తు గురించి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కాలమే నిర్ణయించాలి.