ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్.. ఇకనైనా సీఎం జాగ్రత్తగా ఉంటారా?

ఏపీలో రోజురోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం కరోనా బారిన పడ్డారు. తాజాగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో గత పది, పదిహేను రోజులుగా ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న, కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం.

 

ఇదిలా ఉంటే.. మంత్రి వేణుగోపాల్‌ ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్ తో కలిసి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మంత్రి.. జగన్ వెంటే ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా పాల్గొన్నారు.

అంతేకాదు, ఆదివారం నాడు జరిగిన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి నూతన రథం నిర్మాణ కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తో కలిసి మంత్రి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా హాజరయ్యారు. మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనతో పాటు కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, అధికారులు బెంబేలెత్తుతున్నారు. 

 

మరోవైపు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం జగన్ తో కలిసి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్ గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. పైగా సీఎం ఎప్పటిలాగానే మాస్క్ ధరించకుండానే కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో సీఎం హోం ఐసోలేషన్‌లో ఉంటే మంచిదని, ఇక నుంచైనా మాస్క్ ధరిస్తూ ఆయన జాగ్రత్తగా ఉండటంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.