ఏపీ మంత్రికి ప్రధాని మాటంటే అసలు లెక్క లేదు!

కరోనా కేసులు మనదేశంలో రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే లాక్ డౌన్ ఒక్కటే ప్రస్తుతం మనముందున్న అవకాశమని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ప్రజలెవ్వరూ ఇల్లు దాటి బయటకు రావద్దని, ఏప్రిల్ 15 వరకు ఇళ్లకే పరిమితం కావాలని చెబుతోంది. ప్రధాని మోడీ కూడా మహాభారత యుద్ధాన్ని 18 రోజుల్లో జయించాం, కరోనాని 21 రోజుల్లో జయించలేమా?.. 21 రోజులు ఇంట్లోనే ఉండండి.. కరోనా మహమ్మారిని తరిమికొడదాం అని పిలుపునిచ్చారు. అయితే కొందరికి కరోనా వైరస్ అన్నా, ప్రధాని మాట అన్నా లెక్క లేకుండా పోతుంది. యదేచ్చగా రోడ్ల మీద తిరుగుతున్నారు. అలా తిరుగుతున్నవాళ్ళకి.. 'ఒరేయ్ నాయనా.. ఇంట్లోనే ఉండి మిమ్మల్ని, మీ వాళ్ళకి కాపాడుకోండిరా..' అని చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు కూడా.. ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు.

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లాక్ డౌన్ సమయంలో దుర్గగుడిలో హల్ చల్ చేశారు. ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి, ప్రధాని ఆదేశాలు బేఖాతర్ చేయడం చర్చనీయాంశమైంది. సామాన్య ప్రజలకు చెప్పాల్సింది పోయి.. ఇలా మంత్రి హోదాలో పూజలంటూ, పండగలంటూ తిరగటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సామాన్యులకు మాత్రమే కరోనా సోకుతుందా?. కరోనా కి మంత్రా, ఎమ్మెల్యేనా, సామాన్యుడా అన్న భేదభావం ఉండదు.. ఎవరికైనా సోకుతుంది. ఎవరైనా లాక్ డౌన్ పాటించాల్సిందేనని హితవు పలుకుతున్నారు.

అన్నట్టు మంత్రి వెల్లంపల్లి.. ప్రధాని మాటని మాత్రమే కాదు.. హిందూ ఆచారాలను కూడా తుంగలో తొక్కారంటూ.. హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లి మరణించి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే ఉగాది పంచాంగ శ్రవణం వంటి క్రతువుల్లో పాల్గొనేందుకు అవకాశం లేదని పండితులు చెబుతున్నారు. అయితే మంత్రి వెల్లంపల్లి మాత్రం లాక్ డౌన్ ని, ఆచారాలను రెండింటినీ పట్టించుకోకుండా.. దుర్గగుడిలో హల్ చల్ చేశారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇలా రాష్ట్ర మంత్రే లాక్ డౌన్ ని పట్టించుకోకుండా ప్రవర్తించడంపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.