వైసీపీ నేతలు తెలంగాణలో నామినేషన్లు వేస్తారా?

 

ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రధాన పార్టీల నేతలు ప్రత్యర్థుల మీద విమర్శల డోసుని పెంచారు. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ అధినేత జగన్ మీద విమర్శలు గుప్పించారు. ఏపీకి.. హైదరాబాద్ లో ఉండే జగన్ కావాలా?.. ఏపీలోనే ఉండే చంద్రబాబు కావాలా? మీరే తేల్చుకోండి అంటూ వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు.

'కలువ కుంట జగన్ మోడీ రెడ్డి గారు! ఏపీలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌పైన న‌మ్మ‌కంలేద‌ని ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. అలాగే ప్ర‌వ‌ర్తించారు. కలువ కుంట కే పరిమితం అయ్యారు.' అని విమర్శించారు. 'ఎన్నిక‌ల న‌గారా మోగ‌డంతో తెలంగాణ‌లోని  లోట‌స్‌పాండ్‌లో పార్టీనేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై న‌మ్మ‌కంలేద‌ని నామినేష‌న్లు కూడా తెలంగాణ‌లో వేస్తారా?' అని ఎద్దేవా చేసారు. 'ప్రియ‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లారా! ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఈసీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో పార్టీ నేత‌ల‌తో  సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణలోని లోట‌స్‌పాండ్ ‌(హైద‌రాబాద్‌)లో వైసీపీ నేత‌లతో జ‌గ‌న్ అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వహించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ఎవ‌రు రావాలి? ఎవ‌రు కావాలో మీరే తేల్చుకోండి.' అని పిలుపునిచ్చారు.