ఏం మాట్లాడుతున్నారు సార్... ప్రజలే కట్ చేస్తారు జాగ్రత్త...!

 

ఏపీలో మిత్రపక్షంగా ఉన్నా టీడీపీ-బీజేపీ మధ్య ఎప్పటినుండో కోల్డ్ వార్ జరుగుతుంది. అధికారంలో ఉన్న టీడీపీ నేతల కంటే.. బీజేపీ నేతలే టీడీపీపై విమర్సలు చేయడం విచిత్రం. అదేంటో బీజేపీ లేకపోతే టీడీపీ లేదన్నట్టు.. బీజేపీ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ నేతలు. నిన్నటి దాకా సోము వీర్రాజు రెచ్చిపోయాడు. రాజు గారి మాటలు వింటే కోటలు దాటాల్సిందే. అప్పట్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో నేను డిసైడ్ చేస్తా అని వ్యాఖ్యలు చేశాడు. ఆ తరువాత.. పార్టీ పెద్దలతో తిట్లు తిన్నాడు. అంతేకాదు ఈ మధ్య చాలా సందర్భాల్లోనే టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఇక కేంద్ర మాజీ మంత్రి, బిజెపి మహిళా మోర్చా అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా చంద్రబాబును బెదిరిస్తున్నట్టే మాట్లాడారు. మిత్రపక్షం వైఖరి మార్చుకోకుంటే తమ సామర్ద్యం బట్టి అన్ని స్థానాలలో పోటీచేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు వీళ్ల జాబితాలో మరో బీజేపీ నేత చేరారు. ఆయన ఎవరో కాదు.. ఆయనే మాణిక్యాలరావు.

 

మాణిక్యాలరావు.. ఏపీ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి. ఈయన గారు ఏకంగా ఏపీనే కట్ చేస్తారట. ఇంతకీ అసలు సంగతేంటంటే... తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో జరిగిన జన్మభూమి గ్రామసభ కార్యక్రమంలో మంత్రిగారు పాల్గొన్నారు. అయితే జడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజుతో మంత్రి గారికి వైరం ఉంది. ఈనేపథ్యంలో... ఆయన కాస్త ఆవేశ పడి రెచ్చిపోయారు. నియోజకవర్గంలో తనను అంటరానివాడిగా చూస్తున్నారని, స్థానికంగా జరిగే కార్యక్రమాలకు తనను టీడీపీ నేతలు ఆహ్వానించలేదని, తానేమైనా శత్రువునా? అని ఆరోపించారు. "నన్ను నిలదీసే పరిస్థితి వస్తే ప్రభుత్వాన్నే నిలదీస్తా... నన్ను కట్‌ చేయాలని ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్‌ను కూడా కట్‌ చేస్తా.. సహనానికి హద్దులు ఉంటాయి.. కచ్చితంగా కుక్కకాటుకు చెప్పు దెబ్బ ఉంటుంది".. బాపిరాజు వర్గం, నాకు అవమానం చేస్తుంది అని మంత్రి అన్నారు. అంతేకాదు పలు అనుచిత వ్యాఖ్యలు కూడా ఉపయోగించారు. అయితే బాపిరాజు మాట్లాడుతూ, నేను ఏమి చెయ్యలేదు అని,మంత్రి అపోహపడుతున్నారని అన్నారు. ఏది ఏమైనా...  ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని.. రాజకీయాల్లో సవా లక్ష ఉంటాయి... అక్కడ లోకల్ గా ఉండే వారి మీద ఈయన వ్యాఖ్యలు చేసుకోవాలి...అంతేకాని ఇలా రాష్ట్ర పరువు తీసే విధంగా మాట్లాడటం... సిగ్గు చేటని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ ను మీరు కట్ చేసేది ఏంటి.. ప్రజలు తలుచుకుంటే మిమ్మల్ని కట్ చేస్తారు అని అంటున్నారు. మరి మొన్న గజల్ శ్రీనివాస్ ఉత్తముడు అని బిరుదు ఇచ్చి, తెల్లారినాక నాలుక కరుచుకున్నారు. ఇప్పుడు కూడా, తన స్థాయి మరిచి మాట్లాడిన మాటలకు మంత్రి గారు క్షమాపణ చెప్తారేమో చూద్దాం...