89 ఎకరాలపై ఏపీ మంత్రి కన్ను.. విచారణకు రానున్న కేంద్ర బృందం?
Published on: Tue Jul 28, 2020 2:06PM
పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి మండలంలో 89 ఎకరాల గిరిజనుల భూములున్నాయి. ఆ భూములు గత 20 ఏళ్ల నుంచి ప్రస్తుత ఓ ఏపీ మంత్రి అధీనంలోనే అనధికారికంగా ఉన్నాయి. అక్కడ ఉన్న మామిడి పంటను కూడా ఆయనే అనుభవిస్తున్నారు. నిజానికి షెడ్యూల్ ఏరియా భూమి అంటే అక్కడ గిరిజనులకు మాత్రమే భూమి ఉండాలి. కానీ ఓ షావుకారు.. వారికి అప్పులిచ్చి, తన పేరు రాయించుకున్నారట. ఆయన మంత్రికి బినామీ అని టాక్. ఇప్పుడు మంత్రి ఆ షావుకారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను తీసుకుని, తన పేరు మీదకు బదలాయించుకునే పనిలో ఉన్నారట. దానికోసం పెద్ద స్కెచ్చే వేశారు.
89 ఎకరాల గిరిజనుల భూములన్నీ 1970కు ముందే.. అంటే 1/17 చట్టం అమలుకాకముందే, కొనుగోలు చేసినట్టు.. అంటే సదరు భూములన్నీ మంత్రి హక్కుభుక్తమన్న వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే ఆర్డీఓ కార్యాలయం నుంచి ఓ డాక్యుమెంటు కూడా పుట్టించేశారట. దాన్ని ఆమోదించాలని అటు ఐటిడిఓ ప్రాజెక్టు ఆఫీసర్, ఇటు జిల్లా కలెక్టర్ పై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారట. వాళ్లు మాత్రం మావల్ల కాదంటున్నట్లు చెబుతున్నారు.
ఇంతకూ మంత్రి ఆలోచన ఏమిటంటే.. పోలవరం నిర్వాసితులకు ఇళ్ల స్థలాల కింద, తనదని చెబుతున్న ఆ 89 ఎకరాలను ప్రభుత్వంతో కొనుగోలు చేయించి, భారీగా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారట. ఈ వ్యవహారంపై గిరిజనుల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కులేదు.
అయితే, ఇది అటు తిరిగి ఇటు తిరిగి, నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెవికి చేరిందట. మరి ఆయన ఊరుకుంటారా? పైగా ఇటీవల సదరు మంత్రి , ఆయనపై బోలెడన్ని విమర్శలు కూడా చేశారు. ఇంకేముంది, ఈ భూముల వ్యవహారంపై కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దానితో స్పందించిన కేంద్రమంత్రి.. గిరిజన శాఖ ఉన్నతాధికారిని పిలిచి, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిసీస్‌కు ఈ బాధ్యత అప్పగించాలని ఆదేశించారని సమాచారం. ఆ ప్రకారంగా, సదరు అధికారుల బృందం రేపో, మాపో జీలుగుమిల్లికి వచ్చి ఆ భూముల లెక్కేంటో? ఆ షావుకారు లెక్కేంటో? ఆ మంత్రి లెక్కేంటో? తేలుస్తుందట.


