ఎన్నికల కోసం అధిష్టానం డబ్బు పంపితే.. పొలాలు కొన్న ఏపీ మంత్రి

 

రాజకీయాలు బాగా 'కాస్ట్ లీ' అయిపోయాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో గెలవడం కోసం పోటాపోటీగా ఖర్చు పెడుతున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొందరు ఏపీ మంత్రులు మాత్రం అప్పనంగా సంపాదించిన సొమ్ములు ఖర్చు చేయకుండా టీడీపీకి ఝలక్ ఇచ్చారట.

హోరాహోరిగా సాగిన ఎన్నికల్లో కొందరు టీడీపీ నేతలు.. ఇప్పటికే ఒకసారి గెలిచాం, సంపాదించుకున్నాం. సంపాదించిన సొమ్మును ఎందుకు ఖర్చు చేయాలి?. గాలి తోలితే గెలుస్తాం.. లేకుంటే ఇంట్లో ఉంటాం. ఈ ఐదేళ్లు సంపాదించిన సొమ్ముని అనవసరంగా ఎందుకు పోగొట్టుకోవాలనే ఉద్దేశ్యంతో రూపాయి బయటకు తీయలేదట. వీళ్ళ సంగతి సరే. ఇంకా కొందరైతే.. ఎన్నికల ఖర్చుల కోసం అధిష్టానం పంపిన సొమ్ములను కూడా ఖర్చు చేయకుండా.. పొలాలు కొనుకున్నారట. ఈ వ్యవహారంపై ఇప్పుడు టీడీపీలో చర్చ జరుగుతోంది.

రాజధాని జిల్లాల్లో ఉన్న మంత్రి ఒకరు ఈవిధంగా చేశారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. గాలివాటంగా రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయిన ఆయన.. తాను పోటీ చేసిన దగ్గర ఖచ్చితంగా తాను ఓడిపోతానని, ఇంకెందుకు సొమ్ములు ఖర్చు చేయాలని ప్రశ్నించారట. అంతే కాదు.. టీడీపీ అధిష్టానం ఇచ్చిన సొమ్ముని కూడా ఖర్చు చేయకుండా భారీగా పొలాలు కొనుగోలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఆయనను కొందరు టీడీపీ నాయకులు ప్రశ్నించినప్పుడు.. 'ఎలాగూ నేను గెలవను.. అందుకే ఆసొమ్ములతో పొలాలు కొన్నాను తప్పేముంది' అని ప్రశ్నించారట. టిక్కెట్ల సమయంలో తాను మాత్రమే గెలుస్తానని, సామాజికవర్గాన్ని అడ్డుపెట్టుకుని.. పట్టుబట్టి టిక్కెట్‌ సాధించిన ఈ మంత్రి గారు.. ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరుతో అధిష్టానం షాక్‌కు గురైందట. ఆయన తన సీటుతో పాటు.. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన సీటు విషయంలో కూడా తలదూర్చి అక్కడ కూడా పార్టీ ఓడిపోవడానికి కారకుడవుతున్నారని తెలుస్తోంది. ఇటువంటి నాయకులను పార్టీలోకి తెచ్చుకుని ప్రోత్సహించి మంత్రి పదవులు ఇస్తే.. వాళ్లు తమ స్వార్థం చూసుకొని పార్టీ ఓటమికి కారణమవుతున్నారని.. టీడీపీ కార్యకర్తలు పార్టీ పెద్దల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.