ఎపి రాజధాని పై త్వరలోనే కీలక నిర్ణయం: బొత్స సంచలన వ్యాఖ్యలు

 

వైసిపి అధికారం లోకి వస్తే రాజధానిని మార్చేస్తారని ఎన్నికల సమయం లో టీడీపీ విమర్శించటం జరిగింది. ఐన కానీ రాజధాని ప్రాంతం లో కూడా వైసిపి ఘన విజయం సాధించటం తెలిసిందే. తాజాగా కృష్ణ నదికి వరదలు వచ్చినపుడు కూడా ఇదే విషయం పై కొంత మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత బాబు ఇంటి తో సహా రాజధాని అమరావతి కూడా వరద ముంపుకు గురయ్యే ప్రాంతమని చూపించి రాజధానిని వేరే ప్రాంతానికి మార్చే ప్రయత్నం కొత్త ప్రభుత్వం చేస్తోందని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఇదే విషయమై సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం ప్రకటిస్తామని అయన అన్నారు. ప్రస్తుత రాజధాని అమరావతిలో సాధారణ వ్యయం కంటే నిర్మాణ వ్యయమే మోయలేనంత భారంగా మారుతోందని అన్నారు. ప్రస్తుత రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడంలో ప్రజాధనం విపరీతంగా దుర్వినియోగం అవుతోందని ఆయన తెలిపారు. గత కొద్ది రోజులుగా వస్తున్న వరదలతో రాజధానిలో ముంపుకు గురయ్యే ప్రాంతాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తేలిందని, ఆ ప్రాంతాలు మునగకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ కాలువలు, డ్యామ్ లు నిర్మించాల్సి ఉంటుందని, ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇదేమంత సమంజసమైన వ్యవహారం కాదని బొత్స వ్యాఖ్యానించారు. దీనితో ప్రభుత్వంపై ఆర్ధికంగా అదనపు భారం పడుతుందని అయన అన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఈ అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటిస్తుందని అయన చెప్పారు.