మీడియాలో పచ్చి అబద్దాలు, పత్రికల్లో పిచ్చి పిచ్చి వార్తలు
Published on: Tue Jun 5, 2012 1:49PM
వై.కా.పా. అధినేత జగన్మోహనరెడ్డిని సిబిఐ ప్రత్యేక గదుల్లో విచారిస్తోంది. అక్కడికి మీడియాకు అనుమతి లేదు. దీంతో పాత్రికేయులు రహస్య సమాచారాన్ని నమ్ముకుంటున్నారు. తమకున్న న్యూస్ సోర్స్ ను నమ్మి రాసేవార్తల్లో పస ఉండడం లేదని పలుపరిశీలనల్లో తేలింది. విచారణ గురించి ఒక్కోపత్రిక, ఒక్కో న్యూస్ ఛానల్ ఒక్కోరకంగా ప్రచారం చేస్తోంది. సరైన సమాచారం తెలుసుకోవటం కోసం మీడియా ఎన్ని కసరత్తులు చేసినా న్యూస్ సోర్స్ సరిగ్గా లేక పాత్రికేయమిత్రులు తమ వార్తల్లో తప్పుడు సమాచారాన్ని పాఠకులకు, వీక్షకులుకు అందజేస్తున్నారు. మీడియా ముందు సిబిఐ చెప్పిన విషయాలు, కోర్టులో జరిగిన సంగతులు, జగన్ చెప్పే మాటలు మాత్రం అన్ని పత్రికల్లోనూ మ్యాచ్ అవుతున్నాయి. కానీ, విచారణ వార్తల్లో మాత్రం పెట్టే శీర్షికకు, వచ్చే అర్థానికీ కూడా తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సిబిఐ ముందు పెదవి విప్పలేదన్న శీర్షికతో ఓ పత్రిక రాసిన వార్తల్లో జగన్ అన్ని గుట్లూ విప్పేందుకు ముందుకు వచ్చారని సమాచారం అని రాశారు. అంటే జగన్ మౌనంగా లేరనే అర్థం వస్తోంది. ఇలాంటి వైరుధ్యాల వల్ల మీడియాపై నమ్మకం కోల్పోవడం సిబిఐ తన విచారణలో జరిగిన విషయాల్లో కొన్నింటినైనా మీడియాకు ముందుకు తెస్తే వార్త విశ్వజనీనతను కాపాడినట్లవుతుందని పాత్రికేయ సీనియర్లు ఆ సంస్థకు సూచిస్తున్నారు. అలాగే మీడియా ఇలా పొంతన లేని పిచ్చి పిచ్చి వార్తలు ఇస్తే ప్రజలు యేవగించుకునే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.


