రాజధాని లేకుండా ఏపీ మ్యాప్.. జగనన్న కొత్త పాఠం..
Published on: Sat Feb 12, 2022 9:55AM
భారతదేశం రాజధాని ఏది అంటే ఢిల్లీ అని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. రాష్ట్రాల రాజధానుల గురించి అడిగినా విద్యార్థులు అంతే స్పీడ్ గా ఆన్సర్ ఇస్తారు. అయితే.. ఏపీ విషయానికి వచ్చే సరికి మాత్రం పరిస్థితి అయోమయంగా మారింది. ఏపీ రాజధాని ఏది? అంటే మాత్రం సమాధానం చెప్పలేని అనిశ్చితి విద్యార్థుల్లోనే కాకుండా అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఉందా? లేదా అనే అస్పష్టత విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో ప్రతిబించింది. ఏపీలోని నాలుగో తరగతికి సంబంధించిన ‘మన ప్రపంచం’ పాఠ్యపుస్తకంలో ముద్రించిన భారతదేశ పటం నుంచి ఏపీ రాజధాని మాయమైపోవడం గమనార్హం. సెమిస్టర్ 2 తెలుగు మాధ్యమం పాఠ్య పుస్తకం చివరిలో భారతదేశం పటాన్ని ముద్రించారు. ఆ పటంలో భారతదేశం మ్యాప్, దాంట్లో అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానులు, కేంద్ర పాలిత ప్రాంతాలను గుర్తించారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు ముద్రించకుండా వదిలిపెట్టారు. రాజధానికి బదులుగా ఆంధ్రప్రదేశ్ అని ముద్రించడం ఇప్పుడు అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది.
.webp)
నిజానికి ఏపీ రాజధాని ఏది అంటే.. విద్యార్థులే కాదు.. పాఠాలు చెప్పే టీచర్లు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అనిశ్చితిలో ఉందని చెప్పొచ్చు. అందుకేనేమో ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో ఏపీ రాజధాని వివరాలు పేర్కొనకుండా ఎగ్గొట్టిందని పలువురు విమర్శిస్తున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి 2020-21కి గాను ముద్రించిన కొత్త పాఠ్యపుస్తకాల్లో ఈ అస్పష్టత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏపీ రాజధాని ఏదో పేర్కొనకపోవడంతో ఫోటో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడది వైరల్గా మారింది. ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అంటూ నిట్టూరుస్తున్నారు. ప్రభుత్వానికే క్లారిటీ లేనప్పుడు విద్యార్థులు మాత్రం ఏం చెబుతారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పి వదిలేయడంపై టీచర్లు, విద్యావంతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ మ్యాప్ చూపించి అన్ని రాష్ట్రాలు, రాజధానుల గురించి విద్యార్థులకు చెప్పేటప్పుడు ఏపీ రాజధాని గురించి ఏం చెప్పాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏపీలో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఫిక్స్ చేసింది. ఆ మేరకు రాజధాని నిర్మాణానికి శిలాఫలకం ఏర్పాటు చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేత శంకుస్థాపన చేయించింది. దాంతో ఏపీ రాజధానిగా అమరావతే ఫిక్స్ అయ్యింది. అయితే, టీడీపీ తరువాత గద్దెనెక్కిన వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మూడు ముక్కలు చేయాలని చూసింది. కానీ ఇంతవరకు రాజధానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడక పోవడంతో ఏపీ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. జగన్ రెడ్డి ఆడిన మూడు ముక్కలాట కారణంగా ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. రాజధాని విషయంలో జగన్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా ఎలా స్పందిస్తుందో మరి!


