ఏపీలో లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనపై సర్కారు సీరియస్- ఉదయం షాపింగ్ సమయాల తగ్గింపు..

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతున్నా ఉల్లంఘనులు ఎక్కువైపోతున్నారు. తమకేం కాదులే అనే వాదనతో వారు చెలరేగిపోతున్నారు. ప్రజలు ఒకేసారి గుమికూడటం వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో తొలుత ఉదయం 6 గంటల నుంచి 9 గంటలుగా ఉన్న సమయాన్ని మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పెంచారు. కానీ ప్రజలు గుమికూడటం మాత్రం ఆపడం లేదు. దీంతో ప్రభుత్వం కూడా పునరాలోచలో పడాల్సిన పరిస్దితి. 

పలు జిల్లాల్లో క్షేత్రస్ధాయి పరిస్ధితిని గమనిస్తున్న కలెక్టర్లు, ఇతర అధికారులకు ప్రజల తీరును చూస్తుంటే చిర్రెత్తుకొస్తోంది. దీంతో షాపింగ్ సమయాలను తగ్గించాలని వారు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా సోమవారం నుంచి నిత్యావసర వస్తువుల షాపింగ్ సమయాలను ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లు ఈ విషయాన్న నిర్ధారించగా.. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వర్తించేలా అధికారిక ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమైంది. 

కరోనా వైరస్ ప్రభావం ఏపీలో నియంత్రణలో ఉందని భావిస్తున్న సమయంలో ప్రజల తీరుతో తిరిగి పరిస్దితి మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే రైతు బజార్లు, ఇతర దుకాణాల వద్ద గళ్లు గీసి ఉంచినా ప్రజలు మాత్రం వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. దీంతో కరోనా అనుమానిత కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ల వినతి మేరకు ప్రభుత్వం షాపింగ్ సమయాలను తగ్గించేయాలని నిర్ణయించింది. అప్పటికైనా పరిస్ధితిలో మార్పు రాకపోతే మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.