TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ స్థానిక ఎన్నికలు: కాంగ్రెస్ ఊసెక్కడ.. రాష్ట్రంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం.?

Published on: Thu Nov 5, 2026 10:37AM

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార  తెలుగు దేశం కూటమి ఘనవిజయం సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే, ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  కాంగ్రెస్ ఈ ఎన్నికలలో ఒక్క మునిసిపల్ చైర్ పర్సన్, కార్పొరేషన్ మేయర్  స్థానంలోనూ కూడా కనీస పోటీ ఇవ్వలేదు సరికదా,   మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోవడం ఏపీలో ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. 

దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలిచిన కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో ఉనికి మాత్రంగానైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  గతంలో ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నాయకులు ఇప్పుడు ఆ పార్టీతో లేరు. క్యాడర్ కూడా దాదాపు ఇతర పార్టీలకు జంప్ అయిపోయిన పరిస్థితి.   పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించాల్సిన బాధ్యత తీసుకోవలసిన ఏపీసీసీ చీఫ్   షర్మిల ఆ విషయంలో ఘోరంగా విఫలమయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించడం వెనుక అధిష్ఠానం వైఎస్ అభిమానులను పార్టీలోకి తీసుకువస్తుందన్న వ్యూహం ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 2024 ఎన్నికలకు ముందు ఆ దిశగా షర్మిల కొంత హడావుడి కూడా చేశారు. అయితే ఆ తరువాత మాత్రం సైలెంట్ అయిపోయారు. ఇక ఇప్పుడు స్థానిక ఎన్నికల సమయంలో షర్మిల పూర్తిగా సైడ్ అయిపోయానన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల సమయంలో పార్టీ క్యాడర్ కు   దిశానిర్దేశం చేయడంలోనూ, అభ్యర్థులను సమాయత్తం చేయడంలోనూ షర్మిల ఇసుమంతైనా ఇంట్రెస్ట్ చూపలేదన్న విమర్శలు కాంగ్రెస్ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. 

స్థానిక సంస్థల వంటి ప్రాథమిక స్థాయి ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టలేకపోవడం,  నిలబడిన అభ్యర్థుల విషయంలో కనీస ప్రచారం కూడా లేకపోవడంతో రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ కోలుకునే వకాశాలు దాదాపు మృగ్యం అన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  వాస్తవానికి రాష్ట్ర విభజన తరువాత నుంచీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్లు అన్న చందంగానే ఉంది.  వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని అందిపుచ్చుకుని పార్టీకి కొత్త ఊపిరి పోస్తారని భావించిన షర్మిల ఆ దిశగా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.   

[AP Local Body Elections, Congress Performance, Political Disappearance,  Sharmila AP Congress President, AP Congress Crisis, AP Politics TeluguOne]