TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ మాట నిలుపుకుంటారా? పులివెందుల బరి నుంచి తప్పుకుంటారా.?

Published on: Mon Oct 19, 2026 11:44AM

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానక సమరం వైసీపీని ఇరకాటంలో పడేసింది. స్థానక సమరం విషయంలో చాలా చాలా గట్టిగా నిలబడతామనీ, ఏకగ్రీవాలకు అస్సలు అవకాశం ఇవ్వమనీ చాలా చాలా ధీమాగా ప్రకటించిన వైసీపీ అధినేత జగన్.. ఆ ప్రకటన సందర్భంగా పార్టీ నేతలకు పలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆ హెచ్చరికలే ఇప్పుడు అసలాయన వచ్చే ఎన్నికలలో పులివెందుల అసెంబ్లీ బరిలో నిలబడతారా? అలా నిలబడితే.. ఆయన స్వయంగా పార్టీ నేతలకు చేసిన హెచ్చరికలు ఏమవుతాయి అన్న చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. 

ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 

 జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనే పరిస్థితి జగన్ కు మింగుడుపడటం లేదు.  పులివెందుల నియోజకవర్గంలోనే సుమారు 16 వార్డులు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. పులివెందుల మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైకాపా అభ్యర్థులు నామినేషన్లు వేయకపోవడం లేదా ఎన్నికలకు దూరంగా ఉండటం గమనార్హం. ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీలో చైర్మన్ పదవితో పాటు ఒక్క వార్డుకు కూడా వైకాపా నామినేషన్ దాఖలు చేయకపోగా, కమలాపురం, మైదుకూరు వంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.  అనంతపురం జిల్లా తాడిపత్రి, గుత్తి, ఎర్రగుంట, తిరుపతి కార్పొరేషన్,  పుంగనూరు వంటి పలు నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. రాయచోటి, మైదకూరు మునిసిపల్ చైర్మన్ పదవులు ఏకగ్రీవంగా తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి. 

ఈ నేపథ్యంలో జగన్ హెచ్చరిక మేరకు ఆయన పులివెందుల అసెంబ్లీ టికెట్ కు దూరం కావాలి. అలాగే పుంగనూరు పుడింగి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా పార్టీ టికెట్ ఇవ్వకూడదు. ఇదే విషయాన్ని తెలుగుదేశం కూటమి నాయకులు ఎత్తి చూపుతూ జగన్ కు సవాల్ విసురుతున్నారు.  సొంత కంచుకోట పులివెందులలోనే ఏకగ్రీవాలను నివారించడంలో విఫలమైన జగన్ పులివెందుల నుంచి ఎలా పోటీ చేస్తారని నిలదీస్తున్నారు.  జగన్ తన మాటకు కట్టుబడి పోటీకి దూరంగా ఉండటమే కాకుండా, పెద్దిరెడ్డి తదితరులకు కూడా పార్టీ టికెట్ ఇవ్వకూడదని అంటున్నారు.    ఎన్నికల్లో అధికార పార్టీ వేధింపులు, పోలీసుల తీరు వల్లే నామినేషన్లు వేయలేకపోయినట్లు జగన్ చెప్పుకుంటున్నప్పటికీ.. పరిశీలకులు మాత్రం జగన్ హయాంలోలా ఏపీలో ఇప్పుడు ఎక్కడా అంతటి అరాచకత్వం లేదని విశ్లేషిస్తున్నారు. 

అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీ శ్రేణుల్లో  నైతికస్థైర్యం నింపడంలో నాయకత్వం విఫలమవుతోందనీ, మరీ ముఖ్యంగా బలమైన నాయకులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో సైతం నామినేషన్ల ప్రక్రియలో వెనకడుగు వేయడం పార్టీ అంతర్గత బలహీనతలను బయటపెడుతోందని   విశ్లేషకులు అంటున్నారు.    

మొత్తంగా చూస్తే, జగన్ జారీ చేసిన నిబంధనే ఇప్పుడు ఆయనకు అతిపెద్ద సవాలుగా మారింది. ఇచ్చిన మాటకు కట్టుబడి చర్యలు తీసుకుంటే సీనియర్ నాయకులు దూరం అవుతారు.. ఒకవేళ వెనక్కి తగ్గితే అధినేత మాటపై విశ్వసనీయత సన్నగిల్లుతుంది.  

[Ap Local body Elections, unanimous, Jagan Caution,municipal elections, Pulivendula, YSRCP politics, Seniors, Assembly Tickete, Telugu One]