TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు

Published on: Mon Apr 21, 2025 8:16PM

 

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌‌ఫోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. తాను రేపు విచారణకు హాజరవుతానని వారికి ఆయన తెలిపారు. అయితే, హాజరవుతారో లేదోనని అనుమానంగా ఉందని, తమ వెంట రావాల్సిందేనని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయారు. మరికాసేపట్లో అతడిని విజయవాడ తరలించనున్నారు. మరోవైపు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్‌ కసిరెడ్డి, హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. తదుపరి విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది. ఈ క్రమంలో మంగళవారం తాను విచారణకు హాజరవుతానని రాజ్‌ కసిరెడ్డి ఇవాళ ఆడియో  రిలీజ్ చేశారు. అంతలోనే అతడిని ఏపీ సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ నేపథ్యంలోనే ఆయన సిట్ అధికారులనుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన కోసం సిట్ బృందాలు గాలింపు చేపట్టాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌తో పాటు గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్‌లో గాలించాయి. ఈ క్రమంలో అతడి నివాసానికి నోటీసులు అంటించాయి. అతడి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న రాయదుర్గంలోని ఆరేట ఆసుపత్రితోపాటు రాజ్ కసిరెడ్డికి చెందిన ఈడీ క్రియేషన్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్‌పై విధించిన పాలసీలు, సరఫరా విధానాలు, టెండర్ విధానాల్లో భారీ ఆర్థిక అక్రమాలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ముఖ్యంగా, కొన్ని లిక్కర్ కంపెనీలకు ప్రభుత్వ నిబంధనలు మీరి మినహాయింపులు ఇవ్వడం, కొందరికి అనుచిత లాభాలు వచ్చేలా పాలసీ మార్చడం వంటి చర్యలు ఈ స్కాంకు బలమైన ఆధారాలుగా మారుతున్నాయి. ఈ వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.