TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లాసెట్ పరీక్ష రాసిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ

Published on: Thu Jun 5, 2025 2:36PM

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసి,  పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు న్యాయశాస్త్ర ప్రవేశ పరీక్ష (లాసెట్)కు హాజరయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఆయన లాసెట్ పరీక్ష రాశారు.    వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆయనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిండి, అనేక తప్పుడు అభియోగాలతో పాటు అక్రమంగా సస్పెన్షన్లు విధించిన సంగతి తెలిసిందే.  రెండు విడతలుగా ఆయన సస్పెన్షన్‌లో కొనసాగాల్సి వచ్చింది. మొదటిసారి 2020 ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 2022 ఫిబ్రవరి 7వ తేదీ వరకు, రెండోసారి 2022 జూన్ 28వ తేదీ నుంచి 2024 మే 30వ తేదీ వరకు ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. మొత్తంగా దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన విధులకు దూరంగా ఉన్నారు. అయితే మొక్కవోని పట్టుదలతో న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. తన పదవీ విరమణ చేసే చివరి రోజున చివరిగా ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ గా బాధ్యతలు చేపట్టి అదే హోదాలో రిటైర్ అయ్యారు.

కాగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావుపై గత ప్రభుత్వ హయాంలోని నాలుగేళ్ల సస్పెన్షన్‌ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన ఏసీబీ కేసును హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఆయన తాజాగా జగన్ బాధితుల తరఫున పోరాటం చేస్తానంటూ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన లాసెట్ పరీక్ష రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ హయాంలో బాధితులైన వారి తరఫున న్యాయపోరాటం చేయడానికే ఆయన లా చదవాలని నిర్ణయించుకున్నారా అన్న చర్చ మొదలైంది.