పోలవరం రివర్స్ టెండరింగ్ పై జగన్ సర్కార్ కు హైకోర్టు గట్టి షాక్

 

 

పోలవరం ప్రాజెక్ట్ కోసం రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన జగన్ సర్కార్ కు ఎపి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పోలవరం పై రివర్స్ టెండరింగ్‌ను నిలుపుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. టెండరింగ్ ప్రక్రియపై మరింత  ముందుకు వెళ్లవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.పోలవరం హైడల్ ప్రాజెక్ట్ టెండర్ రద్దుకు వ్యతిరేకంగా నవయుగ సంస్థ  సోమవారం హైకోర్టును ఆశ్రయించగా..  ఆ రోజు ఇరు పక్షాల వాదనను విన్న హైకోర్టు తీర్పును బుధవారం ఇచ్చింది. ఈ విషయంపై నవయుగ సంస్థ కోర్టులో తమ వాదన వినిపిస్తూ ఇప్పటివరకు ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా తాము టెండరింగ్ పనులు చేపట్టామని, ఐతే అకారణంగా తమ కాంట్రాక్టును రద్దు చేశారని తెలిపింది. అలాగే హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఏపీజెన్‌కో తమకు స్థలాన్ని చూపించకపోవడం వల్లే తాము ముందుకు వెళ్లలేకపోయామని నవయుగ కోర్టుకు తెలిపింది. అందువల్ల ఆ జాప్యం ప్రభుత్వం వల్ల జరిగిందని తమవల్ల పనుల్లో ఎలాంటి జాప్యం జరగలేదని స్పష్టం చేసింది. తాజాగా ఇచ్చిన తీర్పులో హైడల్ ప్రాజెక్టు టెండర్ రద్దు విషయంలో ప్రభుత్వం వాదనను కోర్టు తోసిపుచ్చింది. రివర్స్ టెండరింగ్ పై ముందుకు వెళ్లవద్దని, పూర్తి వివరాలతో తమకు నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.