నరేగాపై ఫలించిన టీడీపీ పోరాటం.. జగనన్న సర్కార్ 12 శాతం వడ్డీతో బకాయిలు చెల్లించాల్సిందే..
Published on: Tue Oct 5, 2021 7:40PM
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపు విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా బిల్లులు మొత్తం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 20 శాతం తగ్గించి ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోను న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికే కొంత చెల్లించి ఉంటే, మిగతా బకాయిలను పనులు చేసినప్పటి నుంచి 12 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపు కోరుతూ దాదాపు 2 వేల పిటిషన్లు దాఖలు కాగా... 1,013 పిటిషన్లపై మంగళవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది
ఉపాధి హామీ బిల్లులపై కోర్టు తీర్పు హర్షనీయమని వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. బిల్లులపై న్యాయ పోరాటానికి అండగా నిలిచిన చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు నిబంధనల మేరకు పనిచేయాలని సూచించారు. కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల్లో పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు. పనులు చేసినవారికి బిల్లులు వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు వైబీ రాజేంద్రప్రసాద్.


