జగన్ సర్కార్ పై  హైకోర్టు సీరియస్.. ప్రభుత్వం దివాళా తీసిందా?

ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని, దానిని అడ్డుకోవాలని కోరుతూ గుంటూరు కి చెందిన సురేష్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా, ప్రభుత్వం దివాళా తీసిందా అంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆస్తులు అమ్ముకోవడం ద్వారా మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

లాక్‌డౌన్ సమయంలో ఇంత అర్జెంటుగా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏంటని హైకోర్టు నిలదీసింది. ప్రభుత్వ భూములను రక్షించుకోవాలి కానీ అమ్ముకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ఆదాయం కోసం ఇతర మార్గాలు అన్వేషించాలి కానీ, ప్రభుత్వ భూములు అమ్ముకోవడం సబబు కాదని హితవు పలికింది. అయితే, కౌంటర్ దాఖలుకు ప్రభుత్వ తరపు న్యాయవాది గడువు కోరారు. తీర్పుకు అనుగుణంగానే భూముల వేలం ఉండాలని స్పష్టం చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.