గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి కేసు ఎత్తివేతను ప్రశ్నించిన హైకోర్టు..

ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై కొంత మంది దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ సందర్భంగా వారు పోలీసులపై దాడి చేసి వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే దీనికి సంబంధించిన కేసులను వైసిపి ప్రభుత్వం ఎత్తివేస్తూ జీవో జారీ చేసింది. అంతేకాకుండా ఈ కేసులపై ప్రాసిక్యూషన్ ను ఉపసంహరించుకుంటూ ఫిబ్రవరి 17న రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ లేఖ రాశారు. దీంతో డీజీపీ లేఖని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్‌ 12న 776 జీవో విడుదల చేస్తూ ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవాలని స్టేషన్‌హౌస్ ఆఫీసర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆదేశాలు జారీ చేశారు.

 

అయితే తాజాగా హైకోర్టులో పసుపులేటి గణేష్ అనే వ్యక్తి ఈ జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన కేసునే ప్రభుత్వం ఇలా ఎత్తేస్తూ పొతే.. ఇలాంటి నేరాలు భవిష్యత్‌లో పునరావృతం అయ్యే అవకాశం ఉందని.. కాబట్టి ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరపాలని హైకోర్టుకు పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం జీవోలోని భాషపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. జీవోలో నేరుగా ముస్లిం యువత అని పేర్కొనడంపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ పిటిషన్‌లో ఎన్ఐఎని కూడా పార్టీగా చేర్చాలని సూచించిన ధర్మాసనం.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ పై దాడి కేసును ఎత్తివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.

 

అప్పట్లో ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన విషయంలో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసినప్పటికీ.. రాత్రికి రాత్రి కొంత మంది మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అయితే ఆ ఘటన ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందని అప్పట్లో పోలీసులు నిర్ధారించి అందులో పాల్గొన్న వారిపై కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏపీలో కొత్తగా వచ్చిన వైసిపి ప్రభుత్వం ఆ కేసుల్ని ఉపసంహరించుకుటూ నిర్ణయం తీసుకుంది.