ఏపీలో 8 మంది ఐఏఎస్‌లకు జైలుశిక్ష!.. చివర్లో ఖతర్నాక్ ట్విస్ట్
Published on: Thu Mar 31, 2022 12:34PM
జగన్ పాలన ఎంత బీభత్సంగా ఉంటుందో అందరికీ తెలిసొస్తోంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామని ప్రజలు లెంపలేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక అధికారులకు టార్చర్ మామూలుగా లేదు. అడుగడుగునా రూల్స్ బ్రేక్ చేయిస్తోంది ప్రభుత్వం. అడ్డగోలు నిర్ణయాలు, అరాచక విధానాలతో తప్పులపై తప్పులు చేస్తోంది. ఆ తప్పులన్నిటికీ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తోంది. శిక్ష కూడా పడాల్సి వచ్చింది.
వైఎస్సార్ హయాంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి లాంటి ఉదంతాలు, ఎల్వీలాంటి వారు కేసుల్లో ఇరుక్కున సందర్భాలు చూశాం. తాజాగా, జగన్ ప్రభుత్వంలో పని చేస్తున్న 8 మంది ఐఏఎస్‌లు కోర్టు ధిక్కరణ కేసులో జైలుశిక్ష, జరిమానాకు గురయ్యారు. అధికారులకు 2 వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. శిక్ష పడిన వారిలో సీనియర్ ఐఏఎస్‌లు విజయ్‌కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజాశంకర్, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎంఎం నాయక్‌లు ఉన్నారు.
అయితే, జైలు శిక్ష పడగానే ఉలిక్కిపడిన ఐఏఎస్‌ల బృందం హైకోర్టును శరణు జొచ్చింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఆ 8 మంది ఐఏఎస్‌లు హైకోర్టును క్షమాపణలు కోరారు. ఇంకోసారి అలా చేయమంటూ సారీ చెప్పారు. దీంతో వారిపై కనికరించిన ఉన్నత న్యాయస్థానం జైలు శిక్షను.. సేవా శిక్షగా మార్చింది.
సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒక రోజు వెళ్లి సేవ చేయాలని ఆ 8మంది ఐఏఎస్‌లను ఆదేశించింది. అలా ఏడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమం చేపట్టాలని.. ఏడాది పాటు సంక్షేమ హాస్టల్‌లో ఒక్కపూట భోజనం పెట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు ఒక రోజు కోర్టు ఖర్చులు కూడా భరించాలని ఉత్తర్వులు ఇచ్చింది.
ఐఏఎస్‌లపై ఉన్న కోర్టు ధిక్కరణ కేసు ఏంటంటే...
హైస్కూల్ ప్రాంగణాలు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో గ్రామ సచివాలయ భవనాలను నిర్మించడాన్ని హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వాటిని వెంటనే తొలగించాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కరణ కేసును ఇనీషియేట్ చేసిన ధర్మాసనం గురువారం విచారణను ప్రారంభించింది. విచారణ అనంతరం ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్రంలోని ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ తరువాత ఐఏఎస్‌లు క్షమాపణలు చెప్పడంతో.. సంక్షేమ హాస్టళ్లలో నెలకు ఒకరోజు చొప్పున ఏడాది పాటు సేవ చేయాలని శిక్షను మార్చి కాస్త ఊరట కల్పించింది. హమ్మయ్య అనుకున్న ఐఏఎస్ అధికారులు.. ప్రభుత్వ పెద్దలు సహకరించకపోతే తాము ఏం చేయగలమని.. సీఎం జగన్ తీరుతో తాము అబాసుపాలు అవుతున్నామని.. కోర్టు శిక్షలకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


