TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జీతం త‌గ్గొద్దు.. పీఆర్సీపై హైకోర్టు ఆదేశం.. జ‌గ‌న‌న్న‌కు బిగ్ షాక్‌..

Published on: Tue Feb 1, 2022 1:32PM

ప్ర‌భుత్వం కొత్త పీఆర్సీ ప్ర‌క‌టించింది. పెర‌గాల్సిన జీతం త‌గ్గింది. ఇలా జ‌ర‌గ‌డం చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. అందుకే, ప్ర‌భుత్వ ఉద్యోగులు గ‌గ్గోలు పెడుతున్నారు. మాకు కొత్త పీఆర్సీ వ‌ద్దు.. పాత జీత‌మే ఇవ్వాలంటూ పోరాడుతున్నారు. ప్ర‌భుత్వం మాత్రం పెంచేదేలేదు పొమ్మంటూ జీతాలు, పే స్లిప్పుల జారీ చేసేస్తోంది. ఉద్యోగులు త‌గ్గేదేలేదంటూ స‌మ్మెకు సై అనేశారు. మ‌రోవైపు, ఏపీ హైకోర్టులో పీఆర్సీ జీవోల‌పై పిటిష‌న్ దాఖ‌ల‌వ‌గా.. తాజాగా సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది న్యాయ‌స్థానం.

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచీ రికవరీ చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

పీఆర్సీ జీవోల ద్వారా సర్వీస్‌ బెనిఫిట్స్‌ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్‌ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఆర్థిక, రెవెన్యూ శాఖల ముఖ్యకార్యదర్శులతో పాటు కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్‌ కమిషన్‌ను చేర్చారు. ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీతాల్లో రికవరీ చేయటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయ‌ప‌డింది.

పీఆర్సీపై నియమించిన ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వలేదని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయవాది వాదనలు వినిపించారు. జీవోల్లో ఎరియర్స్ కట్ చేయటాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా... రికవరీ అంశం లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఉద్యోగులు కోర్టులో పిటిషన్ వేసి బయట ఆందోళనలు చేస్తున్నారని ఏజీ తెలిపారు. సమ్మెకు కూడా నోటీస్ ఇచ్చారని చెప్పారు. 

అయితే స‌మ్మె అంశంతో తమకు సంబంధం లేదని ధర్మాసనం తెలిపింది. పిటిషన్‌లో ఉన్న అంశలకే పరిమితమవుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో అనేక అంశాలు ముడిపడి ఉండటంతో ప్రభుత్వం సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది.