TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ సర్కార్ కు హైకోర్టులో బిగ్ షాక్..

Published on: Mon Dec 27, 2021 4:23PM

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు పీజులు ఖరారు చేస్తూ జగన్ సర్కార్ గతంలో తెచ్చిన 53, 54 నెంబర్ జీఓలను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. ఏపీ లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు జీఓల కొట్టివేత ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఫీజులు ప్రభుత్వం ఎలా ఖరారు చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జీఓ ఇచ్చినట్లు ఏపీ ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీ యాజమాన్యాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఫీజులు ఖరారు చేయాలని ఏపీ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది.

జగన్ సర్కార్ తెచ్చిన జీఓలను తూర్పు గోదావరి జిల్లా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ హైకోర్టులో సవాల్ చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, మరి కొన్ని విద్యా సంస్థలు హైకోర్టును ఆశ్రయించారు. జీఓల జారీలో రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోలేదని, ఫీజుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందని హైకోర్టుకు విన్నవించారు. ఫీజులు ఖరారు చేయడానికి ముందుగా విద్యా సంస్థల్లోని మౌలిక సదుపాయాల కల్పన, ఖర్చులను పరిగణనలోకి తీసుకోలేదని గుర్తు చేశారు. పిటిషనర్ తరఫున లాయర్ ముతుకుమల్లి శ్రీవిజయ్ హైకోర్టులో వాదనలు వినిపించారు.  ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో విద్యా సంస్థల నిర్వహణ, మెరుగైన విద్యా బోధన అసాధ్యం అని సీనియర్ లాయర్ వేదుల వెంకటరమణ, బి. ఆదినారాయణరావు, పి. వీరారెడ్డి గతంలో హైకోర్టుకు తెలిపారు. 

ఏపీలోని ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కళాశాలల్లో ఫీజులను ఖరారు చేస్తూ గత ఆగస్టు 24న ప్రభుత్వం 53, 54 నెంబర్ జీఓలు ఇచ్చింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు పలు మార్లు విచారించింది. చివరికి ఏపీ సర్కార్ ఇచ్చిన జీవోలు 53, 54లను తోసిపుచ్చింది.