TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎస్ఈసీ సాహ్నీకి హైకోర్టు నోటీసులు.. జగన్ కు దెబ్బ మీద దెబ్బ..

Published on: Tue Jun 15, 2021 7:37PM

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి రాహు కాలం వచ్చేసినట్లే కనిపిస్తోంది. రెండు రోజులుగా జగన్ రెడ్డికి సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సోమవారం ఒక్క రోజే రెండు కేసుల్లో ప్రభుత్వానికి షాక్ తగలగా.. మంగళవారం మరో కేసులోనూ దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‍పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వంతో పాటు, ఇతర ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. 

మార్చి 31న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో నీలం సాహ్ని నియామకమయ్యారు. నీలం సాహ్మి ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏప్రిల్ 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది. ఎస్ఈసీ వ్యవహారం జగన్  ప్రభుత్వానికి మొదటి నుంచి పెద్ద తలనొప్పిగా మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉన్నంత కాలం ఆయనతో వివాదమే నడిచింది. ఎన్నికల విషయంలో ఇరు పక్షాల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీపై వేటు వేస్తే.. ఆయన న్యాయపోరాటం చేసి మళ్లీ పదవి దక్కించుకున్నారు. ఆయన పదవిలోకి తిరిగి వచ్చిన తరువాత అనుకన్నట్టే ఎన్నికలు నిర్వహించారు. నిమ్మగడ్డ పదవీ కాలం ముగియడంతో ఏపీ ప్రభుత్వం  ఊరట పొందింది.  ఏరి కోరి నీలం సాహ్నికి ఏపీ ప్రభుత్వం కొత్త ఎస్ఈసీగా అవకాశం ఇచ్చింది.అయితే ఆమె నిర్వహించిన పరిషత్ ఎన్నికలు రద్దు కావడం సంచలనమైంది. 

ఇక విజయనగరంలోని మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 72ను సోమవారం హైకోర్టు కొట్టేసింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత గజపతి  రాజు నియామకం చెల్లదని తీర్పిచ్చింది. అశోక్ గజపతి రాజును తిరిగిన చైర్మన్ గా నియమించాలని ఆదేశించింది. సంగం డెయిరీ కేసులోనూ ఏసీబీ వేసిన పిటిషన్ ను ఏసీబీ స్పెషల్ కోర్టు కొట్టివేసింది.