జగన్ సర్కార్ కి ఒకేరోజు మూడు షాకులు.. ఏబీ పై సస్పెన్షన్ ఎత్తివేసిన హైకోర్టు

ఏపీ హైకోర్టు లో జగన్ సర్కార్ కి ఈరోజు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పంచాయతీ కార్యాలయలకు రంగులపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 623ను హైకోర్టు రద్దు చేసింది. అలాగే, డాక్టర్ సుధాకర్‌ వ్యవహారంపై ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై అనుమానాలు ఉన్నాయంటూ, ఆ కేసుని సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ రెండు షాకులే కాకుండా, ఈరోజు జగన్ సర్కార్ కి హైకోర్టు లో మరో షాక్ కూడా తగిలింది. మాజీ ఇంటెలిజెన్స్ ఛీప్ ఏబీ వెంకటేశ్వరరావుపై హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేసింది. 

ఈ ఏడాది ఫిబ్రవరి లో జగన్ సర్కార్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది. భద్రతా పరికరాలు కొనుగోలులో ఆయన నిబంధనలు అతిక్రమించారన్న అభియోగాల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను విధుల్లో నుంచి తొలగించింది. సస్పెన్షన్‌పై ఏబీ క్యాట్‌ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. అయితే, ఆయ‌నకు‌ తాజాగా హైకోర్టుకు లో ఊర‌ట ల‌భించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేసింది. క్యాట్ ఆర్డర్‌ను కూడా పక్కనపెట్టింది. సస్పెన్షన్ చెల్లదని తేల్చి చెప్పింది. ఏబీ రిట్ పిటీషన్‌ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కీలక ఆధేశాలిచ్చింది. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను కూడా చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది.