TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమ‌రావ‌తిపై హైకోర్టు ధ‌ర్మాస‌నం తీర్పు.. పూర్తి వివరాలు ఇవే..

Published on: Thu Mar 3, 2022 11:26AM

ఇప్పుడంతా హైకోర్టు తీర్పు గురించే చ‌ర్చించుకుంటున్నారు. అమ‌రావ‌తి నిర్మాణంపైనే మాట్లాడుకుంటున్నారు. చంద్ర‌బాబు స్వ‌ప్నాన్ని.. జ‌గ‌న్‌రెడ్డి నాశ‌నం చేసిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. మ‌ళ్లీ అమ‌రావ‌తి ద‌శ‌-దిశ మార‌బోతోంద‌ని ముచ్చ‌ట‌ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల్లో ఇంత‌టి ఆనందానికి కార‌ణం.. హైకోర్టు సంచ‌ల‌న‌ తీర్పు. ఇంత‌కీ రాజ‌ధాని కేసులపై ధ‌ర్మాస‌నం తీర్పులో ఏముందంటే....

ఒక‌టి కాదు రెండు కాదు.. మొత్తం 75 కేసులు. అమ‌రావ‌తిపై వివిధ వ‌ర్గాలు వేసిన కేసులు. వాట‌న్నిటికీ వేరువేరుగా ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పులు వెలువరించింది. ఏపీ మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు పిటిషన్లపై.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశించింది.  అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని.. రాజధాని అవసరాలకు తప్ప.. ఇత‌ర అవ‌సరాల‌కు అమ‌రావ‌తి భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. 

"అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలి. మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలి. ఆరునెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలి. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరు. అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదు. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదు. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలి" అని హైకోర్టు ధర్మాసనం స్ప‌ష్టంగా తెలిపింది.

ఏపీ సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానులు) చట్టాలను సవాలు చేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో ప‌లు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుగుతుండగానే.. ఆ చట్టాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం (యాక్ట్‌ 11/2021) తీసుకొచ్చింది. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేసేలా, భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా చూడాలని కోరారు. సీఆర్‌డీఏ చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశించాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని తదితర అభ్యర్థనతో వాదనలు వినిపించారు.

మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. ఫిబ్రవరి 4న ఈ వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. తాజాగా, ఆ 75 కేసుల్లో వేర్వేరుగా త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని.. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని.. రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికోసం అమ‌రావ‌తి భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని హైకోర్టు డివిజ‌న్ బెంచ్ తీర్పు చెప్ప‌డం జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి దిమ్మ‌తిరిగే షాక్‌.