పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్! జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్
Published on: Thu Jan 21, 2021 10:00AM
పంచాయతి ఎన్నికల అంశంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు షాకిచ్చింది ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్. ఏపీ ఎన్నికల సంఘం ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ పై స్టే విధిస్తూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టి వేసింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని ఏపీ ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. ప్రజా రోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనన్న హైకోర్టు ధర్మాసనం.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గత కొన్నిరోజులుగా జగన్ సర్కార్ వర్సెస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు ఇప్పట్లో వద్దని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పడం.. జరిగి తీరాల్సిందే అన్నట్లుగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకు సాగుతున్నారు. ఈనెల 8న ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ ప్రకటించింది. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఎస్ఈసీ ఇచ్చిన షెడ్యూల్ పై ఏపీ సర్కార్ హైకోర్టుకు వెళ్లగా. సింగిల్ బెంచ్ ఎస్ఈసీ ప్రకటించిన షెడ్యూల్ పై స్టే విధించింది. సింగిల్ బెంచ్ తీర్పు ఎస్ఈసీ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయగా.. మూడు రోజుల క్రితం వాదనలు జరిగాయి. గురువారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. ఏపీ ఎన్నికల సంఘం ఇప్పటికే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 23న తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ రావాల్సి ఉంది. హైకోర్టు ధర్మాసనం తాజా తీర్పుతో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.


