TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆనందయ్య K మందుకు హైకోర్టు అనుమతి.. సర్వేపల్లిలో  పంపిణి షురూ.. 

Published on: Mon Jun 7, 2021 1:40PM

కృష్ణపట్నం ఆనందయ్య కె మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  కరోనా బాధితులకు తక్షణమే కె మందును పంపిణీ చేయాలంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. గతంలో ఆనందయ్య కె మందును ప్రభుత్వం నిలుపుదల చేసింది.

కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉన్నాయంటూ గతంలో ఏపీ ప్రభుత్వం కె మందుకు అనుమతిని ఇవ్వలేదు. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌... మందులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని నివేదికలు తేల్చాయి. 

వివాదంలో సుడిగుండంలో చిక్కుకున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు జనాలకు అందుబాటులోకి వచ్చింది. ఎట్టకేలకు ఆనందయ్య మందు పంపిణి ప్రారంభమైంది. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్నారు.  ఆనందయ్య మందు పంపిణీని కార్య‌క్ర‌మంలో  ఎమ్మెల్యే కాకాణి గోవర్ధ‌న్‌రెడ్డి పాల్గొన్నారు. రెండు రకాల ప్యాకెట్లలో మందు అందిస్తున్నారు. ఇప్ప‌టికే కొవిడ్‌ వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్‌ లోని మందు , క‌రోనా రాని వారు నీలం రంగు ప్యాకెట్‌ లోని మందు వాడాలని సూచిస్తున్నారు, 

సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం లక్షా 8 వేల కుటుంబాలకు.. ప్రతి కుటుంబానికి మందు అందించేలా ఏర్పాట్లు చేశారు. వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి మందు ఇస్తామని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని తెలిపారు. సర్వేపల్లిలో మందు పంపిణీతోనే ఆనందయ్య మందు ఆగిపోదని, త్వరలోనే ఇతర జిల్లాలకూ పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. అల్లోపతి మందులు వాడుతూనే ఆనందయ్య మందు తీసుకోవాలని తెలిపారు. 

తన  ఔషధ పంపిణీలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని, అందుకే సవ్యంగా సాగట్లేదని కృష్ణపట్నం ఆనందయ్య తెలిపారు. మందు తయారీకి అవసరమయ్యే మూలికలు, సామగ్రి సరిగ్గా సమకూరడం లేదని వాపోయారు. మందును తయారు చేసేందుకు యంత్ర సామగ్రిగానీ, విద్యుత్ సదుపాయాలూ లేవన్నారు. మందు తయారీకి ఏపీ ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందట్లేదని ఆయన ఆరోపించారు. అనుమతులైతే ఇచ్చిందిగానీ సాయం మాత్రం చేయలేదన్నారు. ప్రస్తుతం కృష్ణపట్నంలో ఔషధ పంపిణీ కొనసాగుతోందన్నారు. ఇతర ప్రాంతాల వారు రావొద్దన్నారు. ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఇతర ప్రాంతాల వారికీ మందును ఇస్తామని చెప్పారు.

మరోవైపు సర్వేపల్లి, చంద్రగిరి నియోజకవర్గాల్లోనే మందు పంపిణి చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఆనందయ్య తయారు చేసిన మందును ఇస్తున్న ప్యాకెట్లపై సీఎం జగన్ ఫోటో ఉంచడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్య ఉచితంగా మందు ఇస్తుండగా... వైసీపీ నేతల ఫోటోలు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మందుపైనా రాజకీయం లబ్ది పొందాలనుకోవడం దుర్మార్గమని మండిపడుతున్నారు.