బిగ్ బ్రేకింగ్: అమరావతి రైతుల సభకు అనుమతి
Published on: Wed Dec 15, 2021 4:08PM
రాజధాని అమరావతి రైతులకు ఊరట లభించింది తిరుపతిలో తలపెట్టిన అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల లోపు సభను నిర్వహించుకోవాలని ఆదేశించింది. కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించాలని ధర్మానసం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17న తిరుపతిలో సభ నిర్వహించనున్నారు అమరావతి రైతులు.
హైకోర్టులో ఇరు వర్గాల హోరాహోరీ వాదనలు జరిగాయి. పాదయాత్రకు అనుమతి ఇచ్చారని, సభకు కూడా అనుమతి ఇవ్వాలని కోరిన పరిరక్షణ సమితి న్యాయవాదులు. సభకు అనుమతి ఇవ్వడం వల్ల రెండు ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సభకు కూడా అనుమతి ఇచ్చింది హైకోర్టు ధర్మాసనం.
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర మంగళవారం ముగిసింది. నవంబర్ 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరులో ప్రారంభించిన మహా పాదయాత్ర 45 రోజులకు అలిపిరిలో ముగిసింది. రైతులు.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా 450 కి.మీ.పైగా పాదయాత్ర చేశారు.
అలిపిరి శ్రీవారి పాదాల చెంతకు పాదయాత్ర చేరగానే.. రథానికి 108 కొబ్బరికాయలు కొట్టి యాత్రకు ముగింపు పలికారు. స్థానికులు గుమ్మడికాయలతో దిష్టితీశారు. మంగళ హారతులు పట్టారు. జై అమరావతి, జైజై అమరావతి నినాదాలతో అలిపిరి మారిమోగిపోయింది. చివరి రోజు మహాపాదయాత్రకు రాజధాని ప్రజలు భారీగా తరలివచ్చారు. అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలంటూ నినదించారు. సుదీర్ఘ పాదయాత్రలో తాము పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు రైతులు. మహాపాదయాత్ర ముగియడంతో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రోజుకు 500 మంది చొప్పున శ్రీవారి దర్శనం చేసుకుంటున్నార మరావతి జేఏసీ ప్రతినిధులు. ఆ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది.


