TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఎస్ఈసీకి ప్రభుత్వం సహకరించాలి! స్థానిక ఎన్నికలపై హైకోర్టు అదేశాలు 

Published on: Wed Dec 23, 2020 2:47PM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి  హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. ఎస్‌ఈసీని ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. కరోనా పరిస్థితులపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల బృందం ఎస్‌ఈసీతో చర్చించిన అంశాలను తెలపాలని, దీనికి సంబంధించి ఈనెల 29న తదుపరి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.   

కరోనా కారణంగా ఎన్నికల వాయిదా విషయంపై ఎన్నికల కమిషన్‌కే లేఖ రాయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా వ్యాక్సిన్, స్థానిక ఎన్నికలు రెండూ ప్రజలకు సంబంధించినవేనని.. దీనిపై కూర్చోని మాట్లాడుకుంటే బాగుంటుంది హైకోర్టు తెలిపింది. అలా కాని పక్షంలో ముగ్గురు అధికారులను ఎస్ఈసీ వద్దకు పంపాలని.. కమిషన్‌తో అధికారుల భేటీపై కమిషనర్ ఒక వేదికను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారుల బృందం ఎస్‌ఈసీతో చర్చించనుంది. కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడానికి కేంద్రం షెడ్యూల్‌ విడుదల చేస్తే దానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.