TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిన్నెళ్లి సోదరుల బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు

Published on: Fri Aug 29, 2025 4:55PM

జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మాచర్లకు సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకటరామిరెడ్డి పిటిషన్ లను పరిశీలించిన ఏపీ హైకోర్టు ఈ కేసులో   పిన్నెల్లి బ్రదర్స్ కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న పోలీసుల వాదనతో ఏకీభవించింది. వారి బెయిలు పిటిషన్లను డిస్మిస్ చేసింది.

ఈ కేసుకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని పోలీసుల తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. వారికి బెయిలు ఇస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదరించే చాన్స్ ఉందని  కోర్టుకు తెలిపారు. ఆగస్టు 21న ఈ కేసులో విచారణ జరుగగా.. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తీర్పును  రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.  పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌‌ను తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం శుక్రవారం (ఆగస్టు 29) తీర్పు వెలువరించింది.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పరారీలో ఉన్నారు. 

ఇంతకీ కేసేమిటంటే.. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి కోటేశ్వరరావు, జవిశెట్టి వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదుతో పిన్నెల్లి బ్రదర్స్‌ సహా హత్యతో ప్రమేయం ఉన్న నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా జవిశెట్టి శ్రీను ఎలియాస్‌ బొబ్బిలి, ఏ2గా తోట వెంకట్రామయ్య, ఏ3గా తోట గురవయ్య, ఏ4గా దొంగరి నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు ఉన్నారు.