2019 ఓటర్ల జాబితానే ఫైనల్ ! ఎస్ఈసీని సమర్ధించిన హైకోర్టు
Published on: Thu Feb 4, 2021 1:33PM
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న మరో నిర్ణయాన్ని హైకోర్టు సమర్దించింది. పంచాయతీ ఎన్నికలకు 2019 జనవరి 1 నాటి ఓటర్ల జాబితానే ఫైనల్ అని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. 2019 ఓటర్ల జాబితా అంశంపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టి వేసింది. ఏపీలో 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాకపోవడంతో... 2019 ఓటర్ల జాబితా అధారంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఎస్ఈసీ. దీంతో 3.6 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతున్నారని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2021 జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది.
ఎన్నికల ఏర్పాట్లలో జిల్లాలో పర్యటిస్తున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. గురువారం నెల్లూరు జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో స్థానిక పరిస్థితులు, భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిమ్మగడ్డ.. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ను గౌరవించకపోయినా ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. గౌరవాలకు, భేషజాలకు పోవాల్సిన అవసరంలేదన్నారు. సుప్రీం కోర్టు సూచన మేరకు తాను ఎన్నికలు నిర్వహిస్తున్నానని, తన విధులను తాను బాధ్యతగా నిర్వహిస్తానని తెలిపారు. రాష్ట్రంలో కరోనా అదుపులోకి రావడం సంతోషమన్నారు నిమ్మగడ్డ. ఎన్నికల నిర్వహణకు ఇదే సరైన సమయమని, ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుర్తు చేశారు.


