ఏమి సెప్తిరి.. ఏమి సెప్తిరి.. సజ్జల సారూ
Published on: Wed Feb 2, 2022 10:44AM
వెనకటికో పెద్ద మనిషి,ఎడమ చేయి తీసి పుర్రచేయి పెట్టమన్నారుట. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ. ‘ఆల్ ఇన్ వన్’ సలహాదారు, సజ్జల రామకృష్ణా రెడ్డి మేథోసంపత్తి కూడా అలాగే వుంది. ఒకసారి ఇచ్చిన జీతాలను వెనక్కి తీసుకోరాదని, అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. జనవరి నెల జీతాల్లో రికవరీ లేకుండా జీతాలు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే, ప్రభుత్వం అర్థరాత్రి ప్రకటించిన ఈ పీఆర్సీని సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తరపున కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్’పై విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేయాలనే పీఆర్సీ ప్రతిపాదన చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ఇచ్చిన జీతాలను రికవరీ చేయడం న్యాయసూత్రాలకు విరుద్ధమని ఏ ఒక్కరి నుంచి కూడా రికవరీ చేయవద్దని ఆదేశించింది. పీఆర్సీలో ప్రభుత్వం 23 శాతంగా ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. అయితే ఇప్పటికే రెండున్నరేళ్ల నుంచి 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) రూపంలో ఉద్యోగులు తీసుకున్నారు. ఇప్పుడు 23 శాతమే ఖరారు చేయడం వల్ల నాలుగు శాతం లోటు పడింది. గత రెండున్నరేళ్ల నుంచి అదనంగా ఇచ్చిన ఈ నాలుగు శాతం మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు తోసి పుచ్చింది.
అయితే సకల సలహా వల్లభుడు సజ్జల రామ కృష్ణా రెడ్డి, తమ మేథోశక్తి మొత్తాన్ని, వినియోగించి, అసలు ‘రికవరీ’ అనేదే పీఆర్సీ పత్రాల్లో లేదని మెలిక పెట్టారు. ఎవరి దగ్గరా జీతాలు రికవరీ చేయడం లేదన్నారు. అయితే... అంతలోనే అసలు గుట్టు విప్పారు. రికవరీ అనే పదం లేదు కానీ, ‘రీఅడ్జస్ట్’ నే పదం ఉందని, ఇప్పుడు చేస్తున్నది కూడా ‘రీఅడ్జస్ట్’ మెంటే కానీ, రికవరీ కాదని, ఉద్యోగులకు జ్ఞానబోధ చేశారు. ఐఆర్ అంటే మధ్యంతర భృతి అనేది తాత్కాలిక అడ్జస్ట్ మెంట్ అని ఇప్పుడు రీఅడ్జస్ట్ మెంట్ చేస్తున్నాం కానీ రికవరీ కాదు అన్నారు.
అయితే ఉద్యోగులు మాత్రం, ఏ రాయి అయితేనేం పళ్ళు ఊడకొట్టటానికి అంటున్నారు. రికవరీనా.. రీ అడ్జస్ట్ మెంటా అన్నది కాదు .. ఇచ్చిన జీతాలు వెనక్కి తీసుకుంటున్నారా లేదా అన్నదే ముఖ్యమని ఉద్యోగులు అంటున్నారు. పేరేది పెట్టినా ఇచ్చిన జీతాలను వెనక్కి తీసుకోవడమే సహజ న్యాయ విరుద్ధమని, న్యాయ స్థానం చెప్పింది కూడా అదేనని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.అయితే, ఏదో విధంగా ఐదు డీఏ బకాయిలు మొత్తం, ఐఆర్ రికవరీతో ‘రీఅడ్జస్ట్’ చేసుకోవాలనేదే సర్కార్ సంకల్పం అనేది సజ్జల చెప్పకనే చెప్పారు. ఇక ఉద్యోగ సంఘాల నాయకులు ఏమి చేస్తారో చూడాల్సి ఉందని అంటున్నారు.


