జీతాల రికవరీపై హైకోర్టు సీరియస్.. జగనన్నకు షాక్!
Published on: Wed Feb 23, 2022 3:17PM
వైఎస్ జగన్ రెడ్డి నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేస్తే తివ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. పీఆర్సీ జీఓలపై బుధవారం విచారించిన హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. పీఆర్సీ జీఓ కాపీలు పిటిషనర్ కు ఇవ్వాలని ఆదేశించింది. పిటిషన్ పై కౌంటర్ తో పాటు పీఆర్సీ నివేదికను కూడా కోర్టులో దాఖలు చేయాలని వైసీపీ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. పీఆర్సీలో ఉద్యోగుల ప్రయోజనాలను తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేవీ కృస్ణయ్య జనవరి నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది.
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీఓల ద్వారా సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడాన్ని కృష్ణయ్య హైకోర్టులో వేసిన పిటిషన్ లో ప్రశ్నించారు. తన పటిషన్ లో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఆర్థిక, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్ ను కూడా కృష్ణయ్య చేర్చారు. కృష్ణయ్య పిటిషన్ పై అంతకు ముందు విచారించిన హైకోర్టు.. ఏ ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దని ఆదేశించింది. ఈ రోజు విచారణ సందర్భంగా రికవరీని తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు మరోసారి స్పష్టంగా చెప్పడం విశేషం.


