ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామక నోటిఫికేషన్.. మహిళలకు 50% రిజర్వేషన్!!
Published on: Sat Jun 22, 2019 5:12PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీకి గాను ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఈ నెల 24 (జూన్ 24) నుంచి జులై 5 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రతి 50కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ ను నియమించనుంది. ఈ జీవో ప్రకారం గ్రామ వాలంటీర్లలో 50% పోస్టులు మహిళలకు కేటాయించనున్నారు. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థి సంబంధిత గ్రామ వాసి అయి ఉండాలి. ఇంటర్వ్యూ పద్ధతిలో గ్రామ వాలంటీర్ల ఎంపిక జరగనుంది. ఆగస్టు 15నాటికి గ్రామ వాలంటీర్ వ్యవస్థ అమలులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు.
అర్హహతలు:
- వయోః పరిమితి: 2019 జూన్ 30 నాటికి 18-35 ఏళ్లు ఉండాలి
- కనీస విద్యార్హత: 10వ తరగతి (గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో) / ఇంటర్మీడియట్ (గ్రామీణ ప్రాంతాల్లో) / డిగ్రీ (పట్టణ ప్రాంతాల్లో)
- దరఖాస్తుల స్వీకరణ: జూన్ 24 నుంచి జులై 5వరకు
- దరఖాస్తుల పరిశీలన: జులై 10వరకు
- అభ్యర్థుల ఎంపిక: జులై 11 నుంచి 25 వరకు
- ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన: ఆగస్టు 1
- దరఖాస్తు వెబ్‌సైట్: http://gramavolunteer.ap.gov.in
- ఓసీ కానివాళ్లు కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.
ఎంపికైన వారికి ఆగస్టు 1న నియామక పత్రాలు అందజేస్తారు. వాలంటీర్లకు ఆగస్టు 5 నుంచి 10 వరకు శిక్షణనివ్వనున్నారు.
గ్రామ వాలంటీర్ల విధులు:
- ఈ గ్రామ వాలంటీర్లు 50 కుటుంబాల పరిధిలో కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా చేయాల్సి ఉంటుంది.
- వాలంటీర్లుగా నియమితులయ్యే వారు తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పని చేయాలి.
- అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంలో, సంబంధిత సమస్య పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలి.
- వివిధ శాఖలకు అందే వినతుల పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా పనిచేయాలి.


