సంచలనం.. జగన్ కేసుల ఉపసంహరణపై హైకోర్టు విచారణ!
Published on: Wed Jun 23, 2021 10:48AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో గండంలో చిక్కుకున్నారు. ఆయనపై గతంలో నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం వివాదాస్పదమవుతోంది. సీఎం జగన్ పై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు కోర్టు దృష్టికి రావడంతో హైకోర్టు పరిపాలన విభాగం వీటిని పరిశీలించి సుమోటోగా విచారణకు తీసుకుంది. హైకోర్టు రిజిస్ట్రీకి నంబర్లు కేటాయించింది. ఈ క్రిమినల్ రివిజన్ పిటిషన్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ముందుకు విచారణకు రానున్నాయి. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిర్యాదుదారులు, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతివాదులుగా ఉన్నారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై 11 కేసులు నమోదయ్యాయి. నమోదైన 11 క్రిమినల్ కేసులను నిబంధనలకు విరుద్ధంగా ఉపసంహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు, ఫిర్యాదుదారులు కలిసి నిబంధనలను ఉల్లంఘించి కేసులను ఉపసంహరించడాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఉపసంహరించిన కేసుల్లో అనంతపురం జిల్లాకు సంబంధించినవి ఐదు కాగా, గుంటూరులో నమోదైనవి ఆరు కేసులు ఉన్నాయి. కరోనా సమయంలో పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సంబంధిత న్యాయాధికారులు కలిసి నిబంధనలకు విరుద్ధంగా ఈ కేసులను హడావుడిగా ఉపసంహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.కేసు విచారణలో ఏం జరుగుతుందున్నది ఆసక్తిగా మారింది. వైసీపీ వర్గాల్లో టెన్షన్ కనిపిస్తోంది.


